
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగు పడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రూ. 4.50కోట్లతో చేపట్టనున్న కొత్తగూడెంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ విద్యను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో సౌకర్యాల మెరుగు కోసం తనవంతు కృషి చేస్తున్నానన్నారు. సుజాతనగర్ మండలానికి జూనియర్ కాలేజీని మంజూరు చేయించానని తెలిపారు.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని డిగ్రీ కాలేజీ అభివృద్ధికి ఫండ్స్ తీసుకొచ్చానన్నారు. ఈ ప్రోగ్రాంలో ఆర్డీవో మధు, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ కత్తి రమేశ్, ఈఈ బుగ్గయ్య, డీఈ నాగేశ్వరాచారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు.