ఓయూ భూములను అప్పగిస్తే ఊరుకునేది లేదు

ఓయూ భూములను అప్పగిస్తే ఊరుకునేది లేదు
  • వీసీ నిర్ణయంపై భగ్గుమన్న అధ్యాపక, విద్యార్థి సంఘాలు 

ఓయూ, వెలుగు: ఆసుపత్రి కోసం మాణికేశ్వరీ నగర్​లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఓయూ వైస్​చాన్స్​లర్​ ప్రకటించడంపై అధ్యాపక, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.  ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ..  జస్టిస్ చిన్నప రెడ్డి కమిషన్ రిపోర్టును తుంగలో తొక్కుతూ తన స్వప్రయోజనాల కోసం ఓయూ భూములను ప్రభుత్వానికి తాకట్టు పెట్టాలని చూస్తున్న ఓయూ వీసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.  ఓయూలో ఇప్పటికే ఉన్న హెల్త్ సెంటర్ ను వంద పడకల ఆసుపత్రిగా మార్చి డాక్టర్ల నియామకాలు చేపట్టి విద్యార్థులకు అధ్యాపకులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్​ చేశారు. 

మరో టర్మ్​పదవి కోసమే..  – ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్​ మనోహర్​ 
ఓయూ వైస్ ​చాన్స్​లర్​ మరో టర్మ్​కోసం ప్రయత్నిస్తున్నాడని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఓయూకు చెందిన సుమారు రూ. 200ల కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆసుపత్రి పేరుతో కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ ఆరోపించారు.   వర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత ఆయన పేర్కొన్నారు.  ఇప్పటికే ఓయూ హెల్త్​సెంటర్​లో  డాక్టర్లు లేక, ఇతర పర్మినెంట్ స్టాఫ్​ లేక కాంట్రాక్టు వైద్యులతో కొనసాగుతుందన్నారు.  సెంటర్​ను అభివృద్ధి చేయాలని, ఇక్కడే వంద పడకల ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు.  మాణికేశ్వరీనగర్‌‌లో పెట్రోల్ బంక్​కు విలువైన స్థలాన్ని లీజుకు ఇచ్చాడన్నారు.  

వర్సిటీ భూములు కొల్లగొట్టేందుకే సీఎం కేసీఆర్ కుట్ర

ఉస్మానియా యూనివర్సిటీ భూములు కొల్లగొట్టడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీజేఎస్​ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,  ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ సహకారంతో వంద పడకల ఆసుపత్రి పేరు మీద యూనివర్సిటీకి  చెందిన విలువైన భూములను అప్పనంగా ధారాదత్తం చేయడానికి కుట్ర జరుగుతుందన్నారు.