న్యూఢిల్లీ : 2020 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా భారత్ స్టేజ్(బీఎస్) 6 వాహనాలనే అమ్మాలని, బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లను, సేల్స్‌ను ఆపివేయాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ 1 తర్వాత కూడా అమ్ముడుపోని బీఎస్ 4 వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు, సేల్స్ చేపట్టేలా తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆటోమొబైల్ డీలర్స్ బాడీ ఫాడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020 మార్చి 1 ముందు వరకే ఇన్వెంటరీని అమ్ముకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతేడాది ఇచ్చిన కోర్టు ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో తమ సభ్యుల తరఫున అప్లికేషన్‌ను దాఖలు చేసినట్టు ఫాడా పేర్కొంది. ఇన్వెంటరీని కాపాడాలని కోరుతున్నట్టు ఫాడా ప్రెసిడెంట్ అశీష్ హర్షరాజ్ ఖాలే చెప్పారు. తమ సభ్యుల డీలర్‌షిప్‌ను కాపాడాలని కోరారు. మార్చి 1 కంటే ముందుగా అమ్ముకోమని చెబుతున్న ఇన్వెంటరీ నెల చివరి వరకు కూడా అమ్ముడుపోదని తెలిపారు. దీంతో 2020 ఏప్రిల్ 1 తర్వాత కూడా తమకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుతో చాలా మంది కార్ల తయారీదారులు ఫిబ్రవరి చివరి వరకు లేదా మార్చి తొలి వారం వరకు బీఎస్ 6 వెహికిల్స్ ప్రొడక్షన్‌లోకి 100 శాతం మారాలనుకుంటున్నారని ఖాలే చెప్పారు. ఆటో ఇండస్ట్రీలో ప్రస్తుత డిమాండ్, తుది గడువు నేపథ్యంలో.. మా సభ్యుల్లో చాలా వరకు 100 శాతం బీఎస్ 4 ఇన్వెంటరీని లిక్విడేషన్ చేయలేరని ఖాలే తెలిపారు. ఫాడా మెంబర్స్‌లో పెద్ద పెద్ద డీలర్‌షిప్ గ్రూప్‌ల నుంచి ఫ్యామిలీలు రన్ చేసే చిన్న చిన్న సంస్థల వరకు ఉన్నాయి. ఎవరి వద్దనైనా బీఎస్ 4 ఇన్వెంటరీ ఉంటే, వారికి ఫైనాన్సియల్‌గా చాలా కష్టమవుతుందని ఖాలే పేర్కొన్నారు. వారి వ్యాపారాలు కూడా ప్రమాదంలో పడతాయని తెలిపారు.

