మోస పోతున్న కస్టమర్లు.. ఉపాధికి దూరమవుతున్న కార్మికులు

మోస పోతున్న కస్టమర్లు.. ఉపాధికి దూరమవుతున్న కార్మికులు

గద్వాల, వెలుగు: గద్వాల చీర పేరుతో జిల్లాలో నకిలీ దందా నడుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ చీరలను దిగుమతి చేసుకొని గద్వాల పట్టు పేరుతో షోరూమ్స్​లో  అమ్ముతున్నారు. వ్యాపారాన్ని అడ్డుకొనే వారు లేకపోవడంతో గద్వాలలో 80 కి పైగా చేనేత చీరల షో రూమ్ లు  వెలిశాయి. ఇతర ప్రాంతాల చీరలను ఇక్కడ అమ్మడంతో స్థానిక కార్మికులకు పని దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాలలో పవర్ లూమ్ పై నేసిన చీరలను ‘గద్వాల పట్టు’ అంటూ.. ఇక్కడ దుకాణాల్లో అమ్ముతున్నారు. ఒరిజినల్ చేనేత కు బదులు... రెడీ మేడ్​ చీరలు తెచ్చి అమ్మడం, దానికి తోడు దాన్ని గద్వాల పట్టు గా నమ్మించడం.. గద్వాల పట్టుకున్న ప్రతిష్టను దిగజార్చడమే అంటున్నారు ఇక్కడి కార్మికులు. 

90 శాతం డూప్లికేట్.. 
ఇంటర్ లాకింగ్ సిస్టం తో కూడిన చేనేత కాటన్ చీర ఖరీదు రూ.4,800 నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడి షోరూం లలో 600 రూపాయల నుంచి  చేనేత చీరలు అంటూ విక్రయిస్తూ మోసం చేస్తున్నారని స్థానిక కార్మికులు అంటున్నారు. చేనేత పట్టును గుర్తించలేని కస్టమర్లకు వీటిని సులభంగా కట్టబెడుతున్నారని చెబుతున్నారు. గద్వాల పట్టు చీర  ధర రూ. 4800 నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. ఇక్కడ కొందరు వ్యాపారులు బెంగళూరు, ధర్మవరం, ముదిరెడ్డిపాలెం, చీరాల, కోయంబత్తూర్, దొడ్డు మల్లాపురం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పవర్ లూమ్ పై చేసిన చీరలు తెచ్చి తక్కువ ధరకు అమ్ముతూ.. ఇటు చీర ప్రతిష్టకు భంగం కలిగించి, కార్మికుల పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు. 

15 వేల మగ్గాల్లో 294   మిగిలాయి
జోగులాంబ గద్వాల జిల్లాలో 15వేల మగ్గాలు ఉండేవి. గద్వాల, గట్టు, ఆరగిద్ద, నాగర్ దొడ్డి, బూడిదపాడు, రాజోలి, పెద్దపల్లి గ్రామాలలో ఇప్పుడు చాలా మగ్గాలు తగ్గిపోయాయి. కానీ షో రూమ్ లు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంలో 80 కి పైగా షో రూమ్ ఉన్నాయి. 

అప్పు కట్టొద్దు.. చీరలు నెయ్యొద్దు
గద్వాల జరీ చీరలు నేసేందుకు మాస్టర్ వీవర్స్ గతంలో చేనేత కార్మికులకు సిల్కు, దారం తదితర సామగ్రి ఇచ్చి పని కల్పించేవారు. కార్మికులకు మాస్టర్ వీవర్స్​ కొంత అడ్వాన్స్ గా కూడా ఇచ్చేవారు. కొంతమంది కార్మికులు అప్పు కూడా తీసుకునేవారు. రాను రాను పవర్ లూమ్ చీరలు ఎక్కువ రావడం వాటిలోనే మంచి లాభాలు ఉండడంతో స్థానికులకు పని ఇవ్వడం మాస్టర్ వీవర్స్ తగ్గించారు. దీంతో చేనేత కార్మికులు వృత్తులను ఎంచుకుంటున్నారు.  

తనిఖీలు శూన్యం.. 
జిల్లా కేంద్రంలో ఇంత జరుగుతున్నా చేనేత శాఖ పట్టించుకోవడం లేదు. అయితే చేనేతను నిత్యం పరిశీలించేందుకు నాలుగు ఎన్​ఫోర్స్​మెంట్​ టీమ్ లు కూడా ఉన్నాయి. కానీ, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మాస్టర్ వీవర్స్, షోరూమ్ ఓనర్లతో చేనేత ఆఫీసర్లు, ఎన్​ఫోర్స్​మెంట్​ వారు కుమ్మక్కై చేనేత కార్మికుల కడుపులు కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కార్మికులను ఆదుకోవాలి
పవర్ లూమ్ పై నేసె చీరలపై చర్యలు తీసుకొని చేనేత కార్మికులను ఆదుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ అంతా డూప్లికేట్ చీరలే దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు కోట్లలో బిజినెస్ చేస్తూ షో రూమ్ నిర్వాహకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నకిలీ చీరలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. 
- రామకృష్ణ చేనేత కార్మికుడు గద్వాల

కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం 
డూప్లికేట్ చీరల విషయంపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. ఎన్​ఫోర్స్​మెంట్​ టీములు మా పరిధిలోకి రావు. కార్మికులకు న్యాయం చేసేందుకు కే తాము కృషి చేస్తున్నాం. నకిలీ చీరలు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటాం. 
- గోవిందప్ప, ఏడీ చేనేత శాఖ