వరంగల్ లో ఫేక్ సర్టిఫికెట్ల కన్సల్టెన్సీలు

వరంగల్ లో ఫేక్ సర్టిఫికెట్ల కన్సల్టెన్సీలు

విదేశాల్లో చదవాలనుకునే వారి వీక్నెస్ ను ఆసరాగా చేసుకున్న కొన్ని ముఠాలు కన్సల్టెంట్స్ పేరుతో అక్రమ దందాలు మొదలుపెట్టాయి. ఫారెన్ ఎడ్యుకేషన్ కి నిబంధనలు ఉండటం... మెరిట్ స్టూడెంట్స్ కే అవకాశాలు లభిస్తుండడంతో ఈ ముఠాకు పెట్టుబడిగా మారింది. విదేశీ నిబంధనలకు తగ్గట్టుగా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి స్టూడెంట్స్ కు ఇస్తున్నారు. అందుకోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని... దేశ సరిహద్దులు దాటిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీలు. 

పిల్లలు విదేశాల్లో ఉన్నారనీ..ఫారెన్ రిటన్స్ అని చెప్పుకోవడం తల్లిదండ్రులకు స్టేటస్ గా భావిస్తుంటారు. అందుకే ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు పంపడానికి పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బీటెక్, MS, MBA, MBBS లాంటి కోర్సులు చేస్తే... ఆ తర్వాత అక్కడే కొలువులో చేరి సంపాదించుకోవచ్చని అనుకుంటారు. విదేశాలకు వెళ్ళాలంటే విద్యార్థులు మంచి మెరిట్ సాధించి.. అర్హతలతో వెళ్లాలి. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం చదువుల్లో వీక్ గా ఉన్నా... అర్హతలు లేకున్నా దొడ్డి దారిన విదేశాలకు పంపాలని భావిస్తున్నారు. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చుచేస్తూ.. తమ పిల్లలతో పాటు తాము కూడా తప్పు చేస్తున్నారు. అలాంటి ఘటనలు వరంగల్ లో బయటపడుతున్నాయి. 

హైదరాబాద్ తర్వాత  వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారుతోంది. దీంతో విదేశాలకు పంపించే కన్సల్టెన్సీల దృష్టి కొద్దికాలంగా వరంగల్ పై పడింది. ఇక్కడ పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. వీటిని రన్ చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఆకట్టుకునేలా హైఫై హంగులతో ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు.  గ్లాస్ లతో ఓ నాలుగు క్యాబిన్లు... ఓ పది మంది ల్యాప్ టాప్ లపై వర్క్ చేస్తున్నట్టు బిల్డప్. విదేశాల్లో తాము పంపించిన వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారంటూ ఫొటోలు పెట్టి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. 

విదేశాల్లో చదువులకోసం అక్కడ సీట్ సంపాందించాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే టైమ్ లో అనేక డౌట్లు వస్తాయి. ఏ కాలేజీలో చేరాలి... ఎంత ఫీజు కట్టాలి లాంటి సమాచారం అవసరం.. దీంతో చాలా మంది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలను సంప్రదిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ కు వెళ్ళేవారు.  కానీ ఇప్పుడు వరంగల్ లో ఇలాంటి కన్సల్టెన్సీలు 100కు పైగా ఉన్నాయి. అర్హతలు లేకున్నా తమ పిల్లలను విదేశాలకు పంపాలనుకునే వారు  ఈ కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. అందుకోసం కన్సెల్టెన్సీల నిర్వాహకులు...ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయిస్తున్నారు. ఫస్ట్ క్లాస్  మార్కులతో  కరెక్షన్  చేసి సర్టిఫికేట్స్ రెడీ చేస్తున్నారు. ఈ తతంగమంతా కన్సల్టెన్సీల నిర్వాహకుల నుంచే. 
 
ఎక్కువ మార్కులు వేయించుకొని... తప్పుడు సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్ళే వాళ్ళ వల్ల... మెరిట్ స్టూడెంట్స్ కు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి చదివిన వారికి అవకాశాలు రావట్లేదని... ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈజీగా ఎడ్యుకేషన్ లోన్ల కోసం... విదేశాల్లో ఉద్యోగం కోసం వీసా స్టాపింగ్ కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని చెబుతున్నారు. 

వరంగల్ లో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు పంపుతున్న కన్సల్టెన్సీల గుట్టును పోలీసులు బయట పెట్టారు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా... మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దేశంలోని వివిధ యూనివర్శిటీల ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి... విదేశాలకు చాలా మందిని పంపినట్లు పోలీసులు గుర్తించారు.  హనుమకొండ డివిజన్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. స్వాదీనం చేసుకున్న కంప్యూటర్స్ , సర్టిఫికెట్ల ఆధారంగా అక్రమంగా విదేశాలకు వెళ్ళిన వారిని... అలా వెళ్లడానికి సిద్దమైన వారికి గుర్తించే పనిలో పోలీస్ శాఖ ఉంది.

విదేశాలకు పంపించే కన్సల్టెన్సీలు ఓ ఆఫీస్... నాలుగు ల్యాప్ టాప్ లు.. కొంత సమాచారం ఉంటే చాలు అన్నట్టుగా మారింది. జాబ్స్ కోసం ఫారెన్ కు పంపించే కన్సల్టెన్సీలకు ఇమ్మిగ్రేషన్ అనుమతులు అవసరం. వారిపై పోలీస్ శాఖ నిఘా కూడా ఉంటుంది. కానీ వరంగల్ లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు... జస్ట్ మున్సిపల్ కార్పోషన్ ట్రేడ్ లైసెన్స్ మాత్రమే తెచ్చుకుంటున్నారు. ఈ కన్సెల్టెన్సీలపై నియంత్రణ అవసరమని న్యాయవాదులు సూచిస్తున్నారు. తప్పుడు మార్గంలో విదేశాలకు వెళితే ఆ దేశాల నుంచి కూడా లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

వరంగల్ లో వెలుగు చూసిన విదేశాలకు ఫేక్ సర్టిఫికెట్ల దందా విచారణలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. కొందరు రాజకీయ ప్రముఖులు, అధికారుల పిల్లలు కూడా ఇలా తప్పుడు మార్గంలో వెళ్లినట్టు తెలుస్తోంది. వాళ్ళు... పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలపైనా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు