- మూడు రాష్ట్రాలకు పంపిస్తున్న ముఠా
- ప్రభుత్వ పథకాలు పొందేందుకు వినియోగం
- విద్యార్హత మెమోలతో పాటు వివిధ ధ్రువపత్రాల తయారీ
- ముఠా వెనుక పొలిటికల్ లీడర్లు ఉన్నట్లు ఆరోపణలు
గద్వాల, వెలుగు: నడిగడ్డలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలకేంద్రంలో ఉన్న లక్ష్మీనరసింహా ప్రింటింగ్ ప్రెస్‌ను కేంద్రంగా చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చి ఐదు రోజులు గడిచినా కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు ప్రత్యేకంగా రేట్లు నిర్ణయించి తెలంగాణతో పాటు కర్నాటక, ఏపీ రాష్ట్రాలకు కూడా నకిలీ సర్టిఫికెట్లు అందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు అడ్డదారిలో పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా, కల్యాణ లక్ష్మి, బ్యాంకు లోన్ల కోసం ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్, డెత్, బర్త్, విరాసత్, బోనఫైడ్ వంటి సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్న వారికి కల్యాణ లక్ష్మి పొందేలా ఫేక్ ఆధార్ కార్డులు, రైతు బీమా డబ్బుల కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్లు, బ్యాంకు లోన్ల కోసం నకిలీ నో-డ్యూ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. స్టడీ సర్టిఫికెట్లు, బోనఫైడ్ కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తుండగా, డెత్ సర్టిఫికెట్ కోసం ఏకంగా రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రజావాణి ఫిర్యాదుతో బయటికి..
ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అయిజ తహసీల్దార్ సూచనతో రెవెన్యూ అధికారులు ప్రింటింగ్ ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గట్టు, అయిజ మండలాలకు చెందిన 18 స్టాంపులు, కర్నాటకలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన రెండు స్టాంపులు, 150కి పైగా నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి విచారణ కోసం అయిజ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.
ముఠా వెనుక రాజకీయ నాయకులు?
ఫేక్ సర్టిఫికెట్ల ముఠా వెనుక గట్టు మండలంలోని చాగదోన, మిట్టదొడ్డి గ్రామాలకు చెందిన కొంతమంది కీలక నేతలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయిజ మండలంలోని కొందరు స్థానిక నాయకులు కూడా ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఒకరిని మాత్రమే అరెస్ట్ చేయడం, మిగతా వారిపై చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం..
అయిజ మండలంలో వెలుగులోకి వచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఎవిడెన్స్ సేకరిస్తున్నాం. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ చేసి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- మొగులయ్య, డీఎస్పీ, గద్వాల
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
గట్టు, అయిజ మండలాల్లో ఇంతకుముందు కూడా నకిలీ పాస్‌బుక్స్, డెత్ సర్టిఫికెట్ల ద్వారా రైతు బీమా క్లెయిమ్‌లు, రైతుబంధు డబ్బుల మళ్లింపులు వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయిజ మండలంలో నకిలీ విత్తనాల సరఫరా, జంతు వ్యర్థాలతో ఆయిల్ తయారీ, బిట్‌కాయిన్ పేరుతో మోసాలు వంటి ఘటనలు కూడా సంచలనం సృష్టించాయి. దీంతో ఈ ప్రాంతాలు అక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
