- 200 మందికిపైగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు నోటీసులు ఇవ్వనున్న ఇంటర్ కమిషనరేట్
- కొంపముంచిన కువెంపు, ఎస్ఆర్టీఎం యూనివర్సిటీలు
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్కు ఫేక్ సర్టిఫికేట్లు అడ్డంకిగా మారాయి. సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లలో 200 మందికి పైగా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీళ్లలో మెజార్టీ మంది కర్నాటకలోని కువెంపు, మహారాష్ట్రలోని ఎస్ఆర్టీఎం (యూజీసీ గుర్తింపు లేని) యూనివర్సిటీల సర్టిఫికెట్లు పెట్టినట్లు తేల్చారు. దీంతో వీళ్లందరికీ త్వరలోనే నోటీసులు ఇవ్వాలని ఇంటర్మీడియెట్ అధికారులు భావిస్తున్నారు.
ఒకేషనల్ కోర్సుల లెక్చరర్ల సర్టిఫికెట్లపై ఆరా
రాష్ట్రంలోని 405 సర్కారు జూనియర్ కాలేజీల్లో 3,686 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో..వాళ్ల లిస్టును అధికారులు రెడీ చేస్తున్నారు. అయితే, ఇందులో చాలామంది పీజీ సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి చేసినట్లుగా ఉండటంతో.. వాటి నిగ్గు తేల్చేందుకు అధికారులు యూజీసీకి లేఖ రాసి వివరాలు సేకరించారు. భారీగా ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఒకేషనల్ కోర్సుల్లో పాఠాలు చెప్పే కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నారు. కాగా, గుర్తింపు లేని వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు.. పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారుల నోటీసుల గురించి ‘కాంట్రాక్టు లెక్చరర్లకు గుర్తింపు బుగులు’ పేరుతో ‘వెలుగు’లో సోమవారం స్టోరీ పబ్లిష్ అయింది. దీనిపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారంపై కఠినంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది.
ఈ వర్సిటీలవే ఎక్కువ
కాంట్రాక్టు లెక్చరర్లు కొందరు యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు పొందినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో చాలామందికి ఆ యూనివర్సిటీలకు గుర్తింపు లేదనే విషయం తెలియదని అధికారులు చెప్తున్నారు. అయితే, కొందరికి కాంట్రాక్టు లెక్చరర్లుగా చేరే నాటికి పీజీ పాస్ సర్టిఫికెట్ లేదని తేలింది. ప్రధానంగా కువెంపు వర్సిటీ–కర్నాటక, ఎస్ఆర్టీఎంయూ–నాందేడ్, ఎంపీ బోజ్ ఓపెన్ వర్సిటీ, బుందేల్ ఖండ్ వర్సిటీ–యూపీ, బర్కతుల్ల వర్సిటీ–బోపాల్, హిందీ సాహిత్య సమ్మేళన్–అలహాబాద్, హిందీ విశ్వవిద్యాలయ, సాహిత్య సంవిధాన, పాండిచ్చేరి వర్సిటీ, ద్రవిడన్ యూనివర్సిటీ, శ్రీరామానందతీర్థ, నాగపూర్ వర్సిటీతో పాటు పలు వర్సిటీల నుంచి గుర్తింపు లేని సర్టిఫికెట్లు పొందినట్టు అధికారుల వెరిఫికేషన్లో తేలినట్టు సమాచారం. వీటిలో కొన్నింటికి మాత్రమే యూజీసీ గుర్తింపు ఉన్నా.. ఆయా సబ్జెక్టుల్లో అభ్యర్థులు పీజీ చదివినట్టు చూపించిన సమయంలో వాటికి గుర్తింపులేదని అధికారులు చెప్తున్నారు.
