హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పబ్లిక్ను కల్తీ సరుకుల బ్యాచ్ బెంబేలెత్తిస్తోంది. కల్తీ అల్లం పేస్ట్, కల్తీ నెయ్యి, కల్తీ పచ్చళ్లు, కల్తీ పన్నీర్.. ఇలా జనం తినే అన్ని ఫుడ్ ఐటమ్స్ను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్న బ్యాచ్ హైదరాబాద్ సిటీలో పెరిగిపోయారు. కొత్తగా కొబ్బరి పొడి కల్తీ చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బస్తాలకు బస్తాల కల్తీ కొబ్బరి పొడిని సీజ్ చేశారు. 8 వేల 3 వందల కేజీల కల్తీ కొబ్బరి పొడి బస్తాలను పోలీసులు సీజ్ చేశారు.
బేగం బజార్లో నకౌల్ మరోటియా అనే వ్యక్తి ఈ గలీజ్ దందాకు పాల్పడుతూ దొరికిపోయాడు. 3 సీలింగ్ మెషీన్లు, 3 వేయింగ్ మెషీన్లు, 4 వందల ప్యాకింగ్ కవర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.21 లక్షల విలువైన ఈ టోటల్ సరుకు, మెషినరీని పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిందితుడు ఈ కొబ్బరి పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడుల్లో ఈ కల్తీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. జియాగూడలోని వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో నిర్వహించిన దాడిలో కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం పచ్చళ్లు, చింతపండు పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తయారీదారులైన ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి హౌస్ నంబర్ 13-3-596/C/1లో ఉన్న గోదాముపై తనిఖీలు నిర్వహించారు.
ఎలాంటి లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు పలు మార్కెట్ల నుంచి కుళ్లిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను తీసుకొచ్చి పచ్చళ్లు తయారు చేస్తున్నారు. ఈ పచ్చళ్లను డ్రమ్ముల్లో నిల్వ ఉంచి నగరంలోని పలు దుకాణాలకు తక్కువ ధరలకు అమ్ముతున్నారు.
ఈ దాడిలో 72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర), ఆరు డ్రమ్ముల టమోటా, చింతపండు పేస్ట్, ఒక డ్రమ్ము అల్లం-వెల్లుల్లి పేస్ట్, వెయింగ్ మెషీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్. నరసింహ (54), ఎన్. నరేశ్ (45) అనే అన్నదమ్ములపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
