హవాలా దందాలో ఫేక్ కరెన్సీ

హవాలా దందాలో ఫేక్ కరెన్సీ
  • ఢిల్లీ, రాజస్థాన్​ ఏజెంట్ల నుంచి క్యాష్ తీసుకొచ్చి నోట్లను మార్చేస్తున్న గ్యాంగ్
  • నకిలీ నోట్లు, వైట్‌‌ పేపర్ బండిల్స్​తో టోకరా
  • నలుగురి అరెస్ట్.. రూ.72 లక్షలు  స్వాధీనం  

హైదరాబాద్‌‌, వెలుగు: ఏజెంట్ల నుంచి హవాలా క్యాష్​ను తీసుకుని వాటిని రిసీవర్లకు ఇచ్చే టైమ్​లో.. ఫేక్ కరెన్సీ, వైట్ పేపర్ల బండిల్స్​ పెడుతూ మోసం చేస్తున్న గ్యాంగ్​కు చెందిన నలుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను  అడిషనల్‌‌ సీపీ ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ వెల్లడించారు.  రాజస్థాన్‌‌కు చెందిన కన్హయ్య లాల్(30) వెస్ట్​బెంగాల్​లోని హౌరాలో స్లైడింగ్​ విండో వ్యాపారంతో పాటు  అక్రమంగా హవాలా క్యాష్ ట్రాన్స్‌‌పోర్ట్ ​చేస్తున్నాడు. ఢిల్లీ, రాజస్థాన్‌‌, హైదరాబాద్‌‌లోని వ్యాపారులతో పరిచయం పెంచుకున్నాడు. ఏజెంట్ల నుంచి సేకరించే హవాలా క్యాష్​ను కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. ఇందుకోసం హవాలా క్యాష్​ను రీసివర్లకు ఇచ్చేటప్పుడు అందులో ఫేక్ కరెన్సీని పెట్టాలని ప్లాన్ వేశాడు. దీంతో పాటు తనకు పరిచయమున్న వ్యాపారుల నుంచి లోన్ల పేరుతో డబ్బు తీసుకుని.. తిరిగి ఇచ్చేటప్పుడు ఫేక్ కరెన్సీని పెట్టేలా స్కెచ్ వేశాడు. రాజస్థాన్‌‌కు చెందిన రామావతార్ శర్మ(24), భరత్ కుమార్(24), రాంకిషన్ శర్మ(25)తో కలిసి కన్హయ్య లాల్ గ్యాంగ్‌‌ ఏర్పాటు చేశాడు. గతేడాది డిసెంబర్​ 24న ఈ గ్యాంగ్ నాంపల్లిలోని ఓ హోటల్ పార్టనర్​ యూనుస్​ఖాన్​ను కలిసింది. అతడి దగ్గరి నుంచి రూ.30 లక్షల క్యాష్ తీసుకుని వారం రోజుల్లో ఇస్తామని ఒప్పందం చేసుకుంది.   తర్వాత గ్యాంగ్​కు చెందిన భరత్ కుమార్, రాంకిషన్ శర్మ రూ.30 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేశారు. వాటిని తీసుకెళ్లి ఈ నెల 1న యూనుస్ ఖాన్​కు అందజేశారు.3వ తేదీన యూనుస్​ఆ నోట్లను పరిశీలించి ఫేక్ కరెన్సీగా గుర్తించాడు. నాంపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 26న మాదాపూర్​లోని ఓ కంపెనీకి సైతం కన్హయ్య గ్యాంగ్ రూ.50 లక్షల క్యాష్​ను అందించాల్సి ఉంది. కానీ ఒకవైపు ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ, మరోవైపు వైట్ పేపర్ బండిల్స్​ను నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కంపెనీ సిబ్బందికి అందించి ఎస్కేప్ అయ్యింది.   మోసపోయినట్లు గుర్తించిన  కంపెనీ సిబ్బంది పోలీసులకు కంప్లయింట్ చేశారు.

ఇలా దొరికారు..

రెండు కంప్లయింట్లతో కేసు ఫైల్ చేసిన నాంపల్లి పోలీసులు.. నార్త్ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేశారు. హవాలా దందాలో నిందితులు చీటింగ్‌‌ స్కెచ్ వేసినట్లు గుర్తించారు. బాధితులు ఇచ్చిన సమాచారం, ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ మోసాలు చేసేందుకు  కన్హయ్య లాల్ గ్యాంగ్‌‌  సిటీకి వచ్చినట్లు గుర్తించారు. సికింద్రాబాద్‌‌ రేతిఫైల్‌‌ బస్‌‌స్టేషన్‌‌ సమీపంలోని భాస్కర్ లాడ్జిలో షెల్టర్‌‌‌‌ తీసుకున్నట్లు సమాచారం అందుకున్నారు. బుధవారం అక్కడికి చేరుకుని కన్హయ్య లాల్, రామావతార్ శర్మ, భరత్ కుమార్, రాంకిషన్‌‌ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.72 లక్షల 50 వేలను స్వాధీనం చేసుకున్నారు. 
నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌‌కి తరలించారు.