
- కర్నాటక నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా అరెస్ట్
- 18 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
శంషాబాద్, వెలుగు: ఫేక్ కరెన్సీ ముద్రించి రాష్ట్రానికి తీసుకువస్తున్న అంతర్రాష్ట ముఠాలోని ఓ సభ్యుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటకలోని కొప్పల్ తాలూకా హోసా లింగాపురం గ్రామానికి చెందిన కొరచ మురుగేశ్(25) అక్కడ జిరాక్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన అన్న రవిచంద్ర, అన్న కొడుకు యోగేశ్ కలిసి జిరాక్స్ సెంటర్ లో రూ. 500 కరెన్సీ ఫేక్ నోట్లు జిరాక్స్ తీశారు.
అనంతరం ఆ నోట్లను మురుగేశ్ బైక్పై శంషాబాద్ కు తీసుకొస్తున్నాడు. మంగళవారం శంషాబాద్ రూరల్ సబ్ ఇన్ స్పెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో తొండుపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో చెక్ చేయగా సుమారు రూ. 18 లక్షల విలువైన నకిలీ కరెన్సీ దొరికింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రవిచంద్ర, యోగేశ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.