పది కూడా పాస్ కాలేదు..పదేళ్లుగా డాక్టర్..

పది కూడా పాస్ కాలేదు..పదేళ్లుగా డాక్టర్..

ఆకాశ్​ కుమార్ బిశ్వాస్ పేరు పెద్దగా ఉంది..పెద్ద మనిషి మాత్రం కాదు.. ఇతనో ఫేక్ డాక్టర్. అవును నకిలీ సర్టిఫికెట్లతో వరంగల్ జిల్లాలో పదేళ్లుగా వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే జనానికి తనకు వచ్చిన చికిత్స చేస్తూ..పెద్ద మొత్తంలో ఫీజులు దండుకుంటూ పోలీసులకు చిక్కాడు. ఆకాశ్ కుమార్ బిశ్వాస్ను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి నుంచి క్లినిక్‌ నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు.

తాత నుంచి డాక్టర్ వారసత్వం..!

స్టేషన్ ఘన్పూర్‌ మండలం శివునిపల్లికి చెందిన ఆకాశ్​ కుమార్ బిశ్వాస్ పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. ఆకాశ్​ తాత గతంలో వైద్యుడిగా పని చేశాడు. ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఆకాశ్ తాత వైద్యం చేశాడు. ఆ సమయంలో ఆకాశ్​​ తాత వద్ద సహాయకుడిగా పని చేశాడు. కొంతకాలం తాత దగ్గర పని చేయడంతో వైద్యం చేయడంలో ఆకాశ్ అనుభవం సంపాదించాడు. దీంతో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నాడు. 

3560 మందికి వైద్యం..

డబ్బు మీద ఆశ...తాత దగ్గర సహాయకుడిగా చేసిన అనుభవంతో ఆకాశ్ కుమార్ బిశ్వాస్..శివునిపల్లిలో ప్రియాంక క్లినిక్ పేరుతో వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. తన క్లినిక్కు వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. జీవితంలో పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, ఫిస్టులా, హైడ్రోసిల్ వంటి రోగాలు మళ్లీ రాకుండా ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తానంటూ క్లినిక్ తెరిచాడు. గత పదేళ్లుగా ఇతను 3,560 మంది వరకు వైద్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.