
- బీజేపీ అంటేనే మారణహోమం, విధ్వంసం
- వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో పౌరహక్కుల సంఘం నేతలు
వరంగల్, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బూటకపు ఎన్‍కౌంటర్లు చేశారని పౌర హక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. ‘ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక’ ఆధ్వర్యంలో సోమవారం గ్రేటర్ వరంగల్‍లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణ మాట్లాడారు. ఆరు నెలల పసిపాపల నుంచి మొదలుకొని 600 మందిని కాల్చి చంపారని.. మహిళలపై అత్యాచారాలు చేశారని ఆరోపించారు. బీజేపీ పాలన అంటేనే మారణహోమం, విధ్వంసమన్నారు.
29 రకాల ఖనిజ వనరులను కార్పొరేట్ పెద్దలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త భారత్ తప్పదన్నారు. సీఎల్‍సీ వరంగల్ అధ్యక్షుడు రమేశ్‍చంద్ర, ఓయూ స్టూడెంట్ ఆజాద్ మాట్లాడుతూ.. అమానవీయ ఆపరేషన్ కగార్‌ను నిలివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా ఆదివాపీల పక్షాన నిలవాలని చెప్పారు. ఆదివాసీలపై మారణహోమానికి నిరసనగా ఈ నెల 24న గ్రేటర్ వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించే సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.