మిర్యాలగూడ, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ల తనిఖీల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నకిలీ కంటి డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది. మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర రాజు కేసు వివరాలు వెల్లడించారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జురి వికాస్ కుమార్ డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి డిప్లమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసి వివిధ కంటి ఆస్పత్రుల్లో అసిస్టెంట్‌గా పనిచేశాడు. అనంతరం 2021లో మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మీ కంటి ఆస్పత్రిని ప్రారంభించాడు.
తాను కంటి డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ రోగులకు చికిత్స అందించేవాడు. స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పేరిట ప్రిస్క్రిప్షన్లు ముద్రించి రోగులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది జూన్ 8న కంటి సమస్యతో వచ్చిన బైరెడ్డి పద్మకు శస్త్రచికిత్స నిర్వహించగా, అనంతరం చూపు మందగించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో పట్టణంలోని పలు కంటి ఆస్పత్రులపై దర్యాప్తు చేపట్టి పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేకంగా కంటి డాక్టర్లుగా చెలామణి అవుతున్న వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బాణావత్ శివకోటేశ్వరరావు, పజ్జురి వికాస్ కుమార్, గడ్డం నాగరాజు ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్యలతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
