
నకిలీ ఫింగర్ ప్రింట్ తో ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఫలక్ నుమా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుని ఆధార్ సెంటర్ నుంచి ఆధార్ ఎన్ రోల్ డివైజ్ తో పాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆధార్ కార్డుల ఎన్ రోల్ మెంట్ సెంటర్ నిర్వహణ కోసం ఫలక్ నుమాకు చెందిన శివశంకర్ భస్వరాజ్ ఆపరేటర్ యూఐడీఏ నుంచి అనుమతులు తీసుకున్నాడు. ఎన్ రోల్ మెంట్ చేసేందుకు శివశంకర్ భస్వరాజ్, అభిమాన్ సింగ్ సుర్జిత్ సింగ్ ఆపరేటర్ గా ఫింగర్ డివైజ్ తో పాటు రెండు సెంటర్ ఐడీలను తీసుకున్నారు. అభిమాన్ సింగ్ సుర్జిత్ సింగ్ తో కలిసి ఫలక్ నుమాలో కొంత కాలం ఆధార్ సెంటర్ ను నిర్వహించారు. ఆ తరువాత ఇద్దరూ ముంబయికి వెళ్లిపోయారు. ఐతే తాము లేకపోయినా ఆధార్ సెంటర్ ను నిర్వహించేందుకు రూల్స్ బ్రేక్ చేసే ప్లాన్ చేశారు. సెంటర్ లో ఎన్ రోల్ డివైజ్ పనిచేయాలంటే శివశంకర్ వేలిముద్ర కావాలి. శివశంకర్ ముంబయిలో ఉండడంతో ప్రతిరోజు ఆధార్ కార్డుల డేటా కోసం అతని ఫింగర్ ప్రింట్ తప్పనిసరి.
ఆర్టిఫిషియల్ ఫింగర్ ప్రింట్ తో ఆధార్ డివైజ్
దీంతో ఆథరైజ్డ్ ఫింగర్ ప్రింట్ శివశంకర్ వేలిముద్రలను నకిలీవి తయారు చేశారు. క్లోనింగ్ చేసిన శివశంకర్ వేలిముద్రతో ఫలక్ నుమాలోని ఆధార్ సెంటర్ ఫింగర్ డివైజ్ ను ఆపరేట్ చేసేందుకు స్కెచ్ వేశాడు. అందుకోసం శాస్ట్రీపురం కింగ్స్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్ధుల్ సమద్(36)ను నియమించుకున్నారు. ఇంజన్ బౌలిలోని హర్మైన్ హాస్పిటల్ సమీపంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశారు. శివశంకర్ నకిలీ ఫింగర్ ప్రింట్ తో ఆధార్ ఫింగర్ డివైజ్ ను సమద్ ఆపరేట్ చేసి ఎన్ రోల్ చేసేవాడు. ఇలా తమ వద్దకు వచ్చే సిటిజన్ల అవసరాలను బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి 1500 వరకు డబ్బులు వసూలు చేశారు. దీంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులను ఎన్ రోల్ చేసేవాళ్లు. ప్రతి వారం 200 నుంచి 300 మంది వ్యక్తిగత డేటాను సేకరించి ఆ డేటాతో సమద్ ముంబయి వెళ్ళేవాడు. అక్కడ శివశంకర్ వద్ద ఉన్న ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైజ్ తో ఎన్ రోల్ చేసిన డేటాను ఆధార్ సర్వర్ కి అప్ లోడ్ చేసేవాళ్లు.
ఫేక్ అడ్రస్ లతో ఆధార్ కార్డులపై ఆరా
ఇలా ఆరునెలల కాలంగా నకిలీ ఫింగర్ ప్రింట్ తో ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఐతే ఫలక్ నుమాలో ఎన్ రోల్ అవుతున్న ఆధార్ డేటా ముంబాయి నుంచి అప్ లోడ్ అవుతుండడంతో యూఐడీఏ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో హైదరాబాద్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అమితా బ్రిందో ఫలక్ నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లేలా నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ పై పోలీసులు నిఘా పెట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సమద్ నడుపుతున్న సెంటర్ పై దాడి చేశారు. సెంటర్ నుంచి ఆర్టిఫీషియల్ ఫింగర్ ప్రింట్ తో పాటు శివశంకర్ ఆథరైజ్డ్ ఫింగర్ ప్రింట్ డివైజ్, లాప్ ట్యాప్, ఐ స్కాన్ డివైజ్ ను స్వాధీనం చేసుకున్నారు. సమద్ ను రిమాండ్ కు తరలించి పరారీలో ఉన్న శివశంకర్ భస్వరాజ్, అభిమాన్ సింగ్ సుర్జిత్ సింగ్ గాలిస్తున్నారు. పాతబస్తీ అడ్డాగా నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ నుంచి ఎలాంటి వ్యక్తుల డేటా అప్ లోడ్ అయ్యింది. వాళ్లందరి అడ్రెస్ లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సెంటర్ నుంచి డేటా నుంచి ఆధార్ పొందిన వివరాలను సేకరిస్తున్నారు.