
యూపీ మంత్రినంటూ వచ్చాడు. రాష్ట్రంలో అధ్యయనం కోసం పర్యటనకు వచ్చానని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. ఆ వ్యక్తి చూపించిన డాక్యుమెంట్స్, డాబు చూసి నమ్మేసిన పోలీసులు, అధికారులు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర అతిథిగా దిగాడు. రాజ భోగాలు అనుభవించాడు. ఓ మంత్రిని కలిసి పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాడు. సీఎం అపాయింట్‌మెంట్ కూడా అడిగాడు. అతడి తీరులో ఏదో తేడా అనిపించి ముఖ్యమంత్రి.. పోలీసులను ఎంక్వైరీ చేయాలని ఆదేశించాడు. దీంతో 12 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాంఛనాలు అందుకున్న ఆ నకిలీ మంత్రి కటకటాల వెనక్కి పోయాడు. ఈ వింత ఘటన గోవాలో జరిగింది.
సునీల్ సింగ్ అనే వ్యక్తి తాను యూపీ కార్పొరేషన్ మంత్రినని చెప్పి గోవా రాజధాని పనాజీలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో దిగాడు. తను మంత్రినని నిరూపించేలా కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్లకు చూపించాడు. దీంతో అతడి వెంట వచ్చిన నలుగురు స్నేహితులకు కూడా స్టేట్ గెస్ట్ హౌస్‌లో అన్ని లాంఛనాలతో మర్యాదలు చేశారు. వాళ్ల బిల్డప్ చూసి నమ్మేసిన అధికారులు, పోలీసులు అక్కడ స్పెషల్‌గా సెక్యూరిటీ కూడా పెట్టారు. ఓ రోజు సౌత్ గోవాలోని స్కూల్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యాడు సునీల్ సింగ్. ఆ ఫంక్షన్‌లో ఉన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రకాశ్ విలిప్ సైతం అతడు ఫేక్ అని గుర్తించలేకపోయారు.
మంత్రితో భేటీ.. తేడాగా అనిపించినా పట్టించుకోలే..
గోవా మంత్రి గోవింద్ గవాడేతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలపై చర్చించాడు. అయితే ఆయనా ఈ ఫేక్ మంత్రిని కనిపెట్టలేకపోయారు. అయితే సునీల్ సింగ్ ప్రవర్తనలో ఏదో తేడాగా అనిపించి.. అతడు వెళ్లిపోయాక గూగుల్‌లో సెర్చ్ చేశానని, ఆ పేరుతో ఏ మంత్రి లేరని తెలిసిందని అన్నారు. కానీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల తాను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు.
సీఎం చెప్పాక..
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలవడానికి ఆ నకిలీ మంత్రి అపాయింట్‌మెంట్ కోరాడు. యూపీ మంత్రి అని చెప్పడంతో ఓకే చేశారు. కానీ అతడి బిహేవియర్‌తో తేడా గమనించిన సీఎం.. ఈ విషయంపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడు ఇచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని దర్యాప్తులో తేలింది. దీంతో మంగళవారం అతడిని స్టేట్ గెస్ట్ హౌస్‌లోనే అరెస్టు చేసినట్లు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఈ విషయంలో ఎంక్వైరీకి యూపీ పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు.