ఆదివాసీలే లక్ష్యంగా నకిలీ నోట్ల చెలామణి

ఆదివాసీలే లక్ష్యంగా నకిలీ నోట్ల చెలామణి
  • ఎనిమిది మంది అరెస్ట్ 

భద్రాచలం, వెలుగు : అమాయక ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠాను చర్ల పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందులో ఓ మహిళతో పాటు బాలుడు, మరో ఎనిమిది మంది ఉన్నారు. మంగళవారం భద్రాచలం ఏఎస్పీ రోహిత్​రాజు వివరాలు వెల్లడించారు. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన చిరిగిడి నరేశ్, కలివేరు గ్రామానికి చెందిన బోస్​ ప్రేమ్​కుమార్, చర్లకు చెందిన సయ్యద్​ఇక్బాల్​, కొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మల సర్వేశ్వరరావు, మరో బాలుడితో పాటు ఆంధ్రాలోని గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన సబ్బటి జయలక్ష్మి, తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన మల్లెల వినోద్​కుమార్, పెద్ద రావూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి జీవరత్నం దొంగనోట్లను ముద్రించి ఈ ప్రాంతంలో చెలామణి చేస్తున్నారు. చత్తీస్​గఢ్ ​సరిహద్దు నుంచి కూలీ పని చేయడానికి వచ్చేవారికి, వారపు సంతలకు వచ్చే ఆదివాసీలకు ఈ నకిలీ కరెన్సీ నోట్లను అంటగట్టేవారు. నిందితుల నుంచి రూ.500 నోట్లు 551, రూ.2000 నోట్లు 90, రూ.200 నోట్లు 300, సీపీయూ, మానిటర్ , కీబోర్డు , ఐరన్​బాక్స్,  ఆకుపచ్చని సన్నటి కవర్​లాంటి దారం, పెన్సిల్​ చెక్కడానికి ఉపయోగించే చాక్​లు 10, కారును స్వాధీనం చేసుకున్నారు. రూ.5.15 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.