దిల్సుఖ్నగర్, వెలుగు: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. భక్తులు సమర్పించిన కానుకల్లో అసలు నోట్లతో పాటు చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న రూ. 100, రూ. 200, రూ. 500 నకిలీ నోట్లు రావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. గత 145 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం అధికారులు లెక్కించారు. మొత్తం రూ. 63,84,446 ఆదాయం రాగా, అందులో పలు నకిలీ నోట్లు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా, అంజన్న హుండీ ఆదాయంలో భారీగా విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఇందులో 67 యూఎస్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 1 మలేషియా రింగిట్, 120 అరబ్ దిర్హంలు, 10 యూకే పౌండ్స్, 100 బంగ్లాదేశ్ టంకాలు, 20 శ్రీలంక రుపీస్, 50 నేపాల్ రూపీస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
