- ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్‌లో ఫ్రూట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్
- అమ్మవద్దని కేంద్రం రెండుసార్లు హెచ్చరించినా మారని తీరు
- పట్టించుకోని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నకిలీ ఓఆర్ఎస్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మెడికల్, ఫార్మా షాపుల్లో బహిరంగంగానే వీటిని అమ్ముతున్నారు. ఓఆర్ఎస్ పేరుతో ఫ్రూట్, ఎనర్జీ డ్రింకులను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గత అక్టోబర్ లోనే రాష్ట్రాలను ఆదేశించింది.
అయినప్పటకీ మన రాష్ట్రంలో వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. ఇవి ఆరోగ్యకరం అనుకొని జనం తాగుతుంటే.. అసలు ఓఆర్ఎస్ అమ్మకాలను అరికట్టాల్సిన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజారోగ్యం పట్టని రాష్ట్ర అధికారులు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్ లను మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. కానీ మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఫ్రూట్ జ్యూస్‌లకు, డ్రింక్ లకు ఓఆర్ఎస్ అని పేరు పెట్టి అమ్ముతున్నాయి. దీనివల్ల అసలైనది ఏదో.. జ్యూస్ ఏదో తెలియక జనం మోసపోతున్నారు.
దీనిపై సీరియస్ అయిన కేంద్రం అక్టోబర్ 14న తొలిసారి ఆదేశాలిచ్చింది. ఫుడ్ ఐటమ్స్ పై, ఫ్రూట్, ఎనర్జీ డ్రింకులపై ఓఆర్ఎస్ పదం వాడొద్దని.. తక్షణం వాటి అమ్మకాలు ఆపేయాలని చెప్పింది. అయినా దేశవ్యాప్తంగా అమ్మకాలు ఆగకపోవడంతో.. నవంబర్ 14న మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఎక్కడైనా రూల్స్‌కు విరుద్ధంగా ఓఆర్ఎస్ పేరుతో కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు కనిపిస్తే వెంటనే సీజ్ చేయాలని.. ఆయా కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లను ఆదేశించింది. కానీ మన రాష్ట్ర ఆఫీసర్లు మాత్రం ప్రజాల ఆరోగ్యాన్ని, కేంద్రం ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
