వ్య‌క్తిని బెదిరించి బంగారం లాక్కున్న ఫేక్ పోలీస్

వ్య‌క్తిని బెదిరించి బంగారం లాక్కున్న ఫేక్ పోలీస్

వరంగల్ : పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుంచి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలతో పాటు బైక్, నాలుగు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన నిందితుడు బానోత్ వెంకటేశ్ 2018 సంవత్సరంలో బార్డర్ సెక్యూరీటి ఫోర్స్‌కు ఎంపికై అస్సాం దిస్సూర్ ప్రాంతంలో మూడు నెలల శిక్షణ తీసుకున్నాడు. అయితే శిక్షణ కఠినంగా ఉందని బి.ఎస్.ఎఫ్ శిక్షణా కేంద్రం నుంచి తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కాగా, జిల్లాలోని రాయపర్తి మండలం జయరాం తండా క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి నిలబడగా లాక్ డౌన్ వేళ ఇక్కడ ఏంచేస్తున్నావని బెదిరించాడు. ఈ వ్యక్తి భ‌య‌ప‌డుతూ తనను హరిశంకర్ గా పరిచయం చేసుకొని.. తాను వరంగల్ నుంచి బంగారు వుస్తువులు తీసుకొని, తొర్రూర్ లోని బంగారు షాపు యజమానికి అందజేసేందుకుగా వెళ్తున్నానని బానోత్ వెంక‌టేశ్ కు బంగారు ఆభరణాలను చూపించాడు.

దీంతో ఆ వ్యక్తిని బెదిరించి అతని ద‌గ్గ‌రున్న‌ బంగారు ఆభరణాలతో పాటు, సెల్ ఫోన్ లాక్కొని బైక్ పై పారిపోయాడు. బాధితుడు హరిశంకర్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పట్టుకునేందుకు వెస్ట్ జోన్ ఇంచార్జ్ డీసీపీ వెంకటలక్ష్మి, వర్థన్నపేట ఏసీపీ రమేష్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. శ‌నివారం సాయంత్రం నిందితుడు ద్విచక్రవాహనంపై వరంగల్ కు వస్తుండగా రాయపర్తి మండలం మైలారం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అనుమానాస్పద వ్యక్తిగా గుర్తించారు.  అదుపులోకి తీసుకొని తనీఖీ చేయగా .. అతడి ద‌గ్గ‌ర‌ బంగారు ఆభరణాలను గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, నకిలీ గుర్తింపు కార్డు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.