కూకట్పల్లి/గండిపేట, వెలుగు: నగరంలో ముగ్గురు నకిలీ పోలీసులను వేర్వేరు ఘటనల్లో టాస్క్‌ఫోర్స్, లోకల్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. బాలానగర్ పోలీసుల వివరాల ప్రకారం.. గురుమూర్తినగర్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ సంతోష్ కుమార్(40), రాపిడో డ్రైవర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్(24) కలిసి నకిలీ పోలీసుల అవతారమెత్తారు. ఖాకీ డ్రెస్, ఏఎస్ఐ స్టార్స్, లోగోలతో తిరుగుతూ రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని టార్గెట్ చేసి కేసులు పెడతామని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఈ నెల 2న పంచశీల కాలనీ గ్రౌండ్ వద్ద మద్యం తాగుతున్న వారిని బెదిరించి రూ. 2,800 ఫోన్ పే చేయించుకోవడమే కాకుండా, మరొకరి వద్ద నుంచి బలవంతంగా స్కూటీ లాక్కున్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వీరిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఖాకీ యూనిఫాం, పోలీస్ లోగోలు, బైకులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏఐతో వీడియోలు సృష్టించి..
సోషల్ మీడియాలో పోలీసుగా నటిస్తున్న ఓ నిందితుడిని రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శాస్త్రీపురానికి చెందిన మహమ్మద్ అబూబకర్ ఆలీ తబస్సుమ్(27) జొమాటో డెలివరీ బాయ్. ఇన్స్టాగ్రామ్లో తాను పోలీసు అధికారిని అని నమ్మించేలా ఏఐను ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తున్నాడు. చేతిలో ఆయుధాలు పట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఇతడిని కాలపత్తర్ పోలీసుల సహకారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
