నిజామాబాద్, వెలుగు: పోలీస్ అధికారిగా నటిస్తూ నగర శివారులోని ఖానాపూర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు వసూలు చేస్తున్న నకిలీ వ్యక్తిని రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను రూరల్ ఇన్‌స్పెక్టర్ సీ.హెచ్. శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన చౌహాన్ గణేష్ పోలీస్ ప్యాంట్ ధరించి తన పల్సర్ బైక్‌పై తిరుగుతూ వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నాడు.
ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేని వారిని బెదిరించి జరిమానాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. అతడిని నిజమైన పోలీస్ అధికారిగా భావించిన పౌరులు డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వసూళ్లపై సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టి, శుక్రవారం ఖానాపూర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
