రైతులను ముంచిన నకిలీ విత్తనాలు

రైతులను ముంచిన  నకిలీ విత్తనాలు
  •    పీఏసీఎస్ ద్వారా పంపిణీచేసిన సోయా సీడ్​
  •     పంట ఎదుగు దశలో ఎండిపోతున్న సోయా 726 రకం
  •     ఆందోళనలో అన్నదాతలు, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
  •     జిల్లాలో 93 వేల ఎకరాల్లో సాగు

ఆదిలాబాద్, వెలుగు : నాసిరకం, నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. జులై, ఆగస్టు నెలలో పడిన భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయా పటలు నీట మునిగి దాదాపు 50 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఇదిలా ఉండగా రైతులకు ఇప్పుడు మరో ముప్పు వచ్చిపడింది. నాసిరకం విత్తనాల కారణంగా ప్రస్తుతం తెగులు సోకి సోయా పంట ఎదుగు దశలోనే ఎండిపోతోంది. జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా సోయా పంట సాగవుతోంది. 

ఈ ఏడాది ఖరీఫ్ లో దాదాపు 93 వేల ఎకరాల్లో సాగు చేయగా ఇప్పటికే 1500 ఎకరాలకు పైగా సోయాకు పచ్చ తెగులు వచ్చి ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. దీని వల్ల ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయినట్లు చెబుతున్నారు. అయితే, ఈ సోయా విత్తనాలు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ద్వారా పంపిణీ చేసినవి కావడం గమనార్హం. ఓ రకం విత్తనాలు కావడంతో సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేశారంటూ ఇటీవల బోథ్ పీఏసీఎస్ ఎదుట రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ఎండిపోయిన సోయా పంట కర్రలతో ఆందోళనకు దిగారు.

తక్కువ రేటని అంటగట్టిండ్రు..

కేడీఎస్ 726 రకం విత్తనాలు తక్కువ రేటు అని, ఎక్కువ దిగుబడి వస్తుందని పేర్కొంటూ పీఏసీఎస్ ద్వారా నాణ్యత లేని విత్తనాలను తమకు అంటగట్టారని రైతులు మండిపడుతున్నారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 కిలోల బ్యాగు రూ.2250కు ఇచ్చి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని సొసైటీ నమ్మించడంతో రైతులు ఆశపడి ఈ రకం విత్తనాలు వేశారు. పక్క పొలాల్లో వేరే రకం విత్తనాల పంటలు ఆశాజనకంగా ఉండగా కేవల ఈ రకం వేసిన రైతుల పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. 

తమకు నష్ట పరిహారం చెల్లించాలని, నాణ్యత లేని విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. అగ్రికల్చర్ ఏఓలు గ్రామాల్లో రైతు వేదికలకే పరిమితమవుతున్నారని.. ఒక్క పంట పొలాన్ని కూడా చూసిన దాఖలాలు లేవంటూ రైతులు ఫైర్​అవుతున్నారు. కొత్త రకం విత్తనాలు ఆ ప్రాంతంలోని భూముల్లో సాగవుతాయో, లేదో అనే అవగాహన రైతులకు కల్పించకుండానే పంపిణీ చేశారని పేర్కొంటున్నారు.

తన పంట పొలంలో పచ్చబారిన సోయా పంటను చూపిస్తున్న ఈ రైతు పేరు నానం శంకర్. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన ఈయన ఈ ఏడాది 5 ఎకరాల్లో కేడీఎస్ 726 రకం సోయా విత్తనాలు వేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.లక్ష పెట్టుబడి పెట్టానని, పంట ఎదుగు దశలో పచ్చబారుతోందని వాపోతున్నాడు. సోయా సైజు పెరగడం లేదని, నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవడంతో పంట ఎండిపోతోందని చెబుతున్నాడు.

పంట పొలాలను సందర్శిస్తున్నాం


సోయా పంట పచ్చబారి తెగుళ్లు రావడం అనేది విత్తనాల సమస్య కాదు. కొన్ని చోట్ల మాత్రమే పంటపై తెగుళ్ల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంట పొలాలను సందర్శించి వివరాలు సేకరించాలని మండల ఏఓలను సూచించాం. ఆయా రకం విత్తనాలు వేసిన కంపెనీలతో మాట్లాడి తెలుసుకుంటాం.
పుల్లయ్య, అగ్రికల్చర్ ఏడీ 

రైతులను ఆదుకోవాలి..


నాణ్యత లేని సోయా విత్తనాలు పంపిణీ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా ఎండిపోయింది. కేడీఎస్ 726 రకం పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేశారు. ఈ విషయంపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారంచెల్లించాలి.
- సంగెపు బొర్రన్న, 
రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు

పంట ఎండిపోయింది


 నాలుగు ఎకరాల్లో కేడీఎస్ రకం సోయా విత్తనాలు వేసిన. ఎకరానికి రూ. 22 వేలు ఖర్చు చేసినం. ఇప్పుడు ఎదిగే దశలో పంట పచ్చబారి ఎండిపోతోంది. మిగతా పొలాల్లో పంట బాగానే ఉంది. పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని పరిహారం చెల్లించాలి. 
- కుమ్మరి విజయ్, రైతు,బోథ్