మెదక్, వెలుగు: నకిలీ విత్తనాలు ఏటా రైతులను నట్టేట ముంచుతున్నాయి. దళారుల మాటలు నమ్మి అన్నదాతలు నిండా మునుగుతున్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతుల వద్దకు వానాకాలం సీజన్ ప్రారంభంలో అదే మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన నర్సింలు వచ్చి తాను విత్తన కంపెనీ సూపర్ వైజర్నని పరిచయం చేసుకున్నాడు.
తమ వద్ద నాణ్యమైన మేలుకరం వరి విత్తనాలు ఉన్నాయని, అవి సాగు చేస్తే ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పాడు. విత్తనాలు ఫ్రీగా ఇస్తామని పంట కోసిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మితే వచ్చే ధరకంటే క్వింటాలుకు రూ.100 ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పాడు.
అతడి మాటలు నమ్మిన 40 మంది రైతులు అతడి వద్ద వరి విత్తన బస్తాలు తీసుకున్నారు. ఎకరాకు 20 కిలోల బ్యాగు విత్తనాలు వేయాలని చెప్పగా తమకున్న విస్తీర్ణాన్ని బట్టి సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎరువులు చల్లినప్పటికీ పొలంలో పిలకలు సరిగా రాలేదని, గొలలు చిన్నగా వచ్చాయని రైతులు తెలిపారు. పంట సరిగా ఎదగకపోవడంతో ఎకరాకు 4,5 క్వింటాళ్ల ధాన్యం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి ఎకరాకు రూ.20 వేల చొప్పున ఖర్చయిందని, పంట సరిగా ఎదగకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని లబోదిబోమంటున్నారు. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్లతోపాటు, చేగుంట పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధిత రైతులు తెలిపారు.
ప్రజావాణిలో ఫిర్యాదు
రుక్మాపూర్ రైతులు సోమవారం మెదక్ కలెక్టరేట్ కు తరలి వచ్చి ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఫిర్యాదు చేశారు. నాణ్యమైన విత్తనాల పేరుతో తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్నప్తి చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
దిగుబడి ఏమీ రాలేదు
ఎకరాకు 20 కిలోల వరి విత్తనాల బస్తా ఇచ్చారు. నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. పిలకలు సరిగా రాలేదు. గొల చాలా చిన్నగా వచ్చింది. ఎకరాకు 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పొలంలో ఇపుడు 5 క్వింటాళ్లు కూడా ఎళ్లేటట్టు లేవు. - కిషన్, రైతు, రుక్మాపూర్
నష్ట పరిహారం ఇప్పియ్యాలే
మా ఊరిలో నలుగురు రైతులం సూపర్ వైజర్ నర్సింలు ఇచ్చిన విత్తనాలు సాగు చేసి నష్టపోయినం. నేను మూడేకరాలు సాగు చేస్తే అంతా ఉట్టిదే అయింది. ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పిచ్చి రైతులను ఆదుకోవాలే. మ్యాకల రమేశ్, రైతు
