అమాయక కూలీలే వారి టార్గెట్..నకిలీ వీసాలతో విదేశాలకు పంపిస్తున్న ముఠా అరెస్ట్

అమాయక కూలీలే వారి టార్గెట్..నకిలీ వీసాలతో విదేశాలకు పంపిస్తున్న ముఠా అరెస్ట్
  • 14 ట్యాంపర్ట్​వీసాలు, పాస్​పోర్టులు సీజ్​

శంషాబాద్, వెలుగు: నకిలీ పాస్ పోర్ట్, వీసాలతో అమాయక కూలీలను దుబాయ్​కు పంపిస్తున్న ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 ట్యాంపర్ట్​వీసాలు, పాస్​పోర్టులు, ఒక ల్యాప్​టాప్, 7 సెల్​ఫోన్స్, 2 స్టాంప్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వివరాల ప్రకారం.. నకిలీ పాస్‌‌పోర్ట్, వీసాలతో 8 మంది వ్యక్తులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్​వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో ఎయిర్​పోర్ట్, ఎస్ఓటీ పోలీసులు కలిసి గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

వీరిని విదేశాలకు పంపిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన బాలాజీ, సుంకారా శివకుమార్​గా గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురు అంజి, గోపాల్, సత్యనారాయణ పరారీలో ఉన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని కూలీలను నకిలీ వీసాలతో దుబాయ్ పంపిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. డబ్బు మీద ఆశతో వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాలపై దుబాయ్​కు పంపిస్తూ చీటింగ్ చేస్తున్నారన్నారు.