యూపీఎస్సీ సిలబస్‌లో తప్పుడు సమాచారం.. కేసు నమోదు

యూపీఎస్సీ  సిలబస్‌లో తప్పుడు సమాచారం.. కేసు నమోదు

ముంబై:  యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఉంచినందుకుగాను ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 (బి) కింద నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద ఆరే కాలనీ పోలీస్ స్టేషన్‌లో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. క్రిమినాలజీ సంస్థ, క్రిమియోఫోబియా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ మాట్లాడుతూ.. బైజూస్ కంపెనీ యూపీఎస్సి పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను పొరపాటుగా తప్పుగా ప్రచురించిందన్నారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే కంపెనీ వారికి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇమెయిల్ పంపానని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన యూపీఎస్సీ.. దేశంలో ప్రఖ్యాతిగాంచిన యూపీఎస్సిలో తప్పుడు సమాచారం రావడం పెద్ద మిస్టేక్ అని, బైజూస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు.