బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాపై పుకార్లను ఖండించిన ప్రభుత్వం

బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాపై పుకార్లను ఖండించిన ప్రభుత్వం
  • బేటీ బచావో.. బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగింపు అవాస్తవం

బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాపై సోషల్ మీడియాలో జరుగతున్న ప్రచారం వట్టి పుకార్లేనని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్రంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను తొలగించినట్లు ప్రచారమవుతున్న వార్తలను ఖండించింది. పౌరసత్వ చట్ట సవరణపై జరుగుతున్న నిరసనలకు మద్దతుగా ఆమె ట్వీట్ చేయడంతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను తొలగించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై హర్యానా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శాఖ స్పందించింది.

పరిణితీ చోప్రాతో ఒక ఏడాదికి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేలా ఎంవోయూ జరిగిందని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆ ఒప్పందం 2017 ఏప్రిల్‌తో ముగిసిందని స్పష్టం చేసింది. ఇప్పుడు కొత్తగా తొలగించినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని, పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది.

ప్రభుత్వం తీరు అనాగరికం

పౌరసత్వ చట్ట సవరణపై జరుగుతున్న నిరసనలకు మద్దుతుగా పరిణితీ చోప్రా గట్టిగానే స్పందించింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా సామాన్యులు తమ అభిప్రాయాలను చెబుతూ నిరసన తెలిపినందుకు వారిపై దాడి చేయడం అనాగరికమని మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయింది. ఒక వేళ ప్రజలు తమ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తే ఇలానే జరుగుతుందంటే రాజ్యాంగాన్నే మార్చేయాలంటూ సెటైర్లు వేసింది. భారత్.. ప్రజాస్వామ్య దేశమేకాదని బిల్ పాస్ చేయాలని సూచించింది.