
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే పై కొవ్వూరుకు చెందిన అడ్వకేట్ మురళీ కృష్ణ ఫిర్యాదు చేశారు. లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని తప్పుడు సర్వేలు చేశారని…దీంతో ఎంతో మంది బెట్టింగులు కట్టి నష్టపోయారన్నారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయనే అనుమానం కూడా వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ.
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను ప్రకటించారు. టీడీపీయే అధికారం చేపడుతుందంటూ… ఆయన జోస్యం చెప్పారు. అయితే ఫలితాల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. లగడపాటి సర్వే తప్పని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు.