
జగిత్యాల టౌన్, వెలుగు: కోరుట్ల యూసుఫ్‌నగర్‌కు చెందిన దుండిగాల నారాయణ(54) శుక్రవారం రాత్రి గుండెపోటుతో జగిత్యాల హాస్పిటల్‌లో చనిపోయాడు. కాగా అతని కొడుకు రఘు ఖతార్‌లో ఉంటున్నాడు. అంత్యక్రియలకు వచ్చేందుకు అక్కడి కంపెనీని పర్మిషన్ అడగగా.. డెత్ ప్రూఫ్ చూపిస్తేనే పంపుతామని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు జగిత్యాల హాస్పిటల్ నుంచి డెత్ డిక్లరేషన్ తీసుకున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో 11/9/2025 డేట్‌తో డెత్ డిక్లరేషన్ ఇచ్చారు. గమనించని కుటుంబసభ్యులు దానిని రఘుకు పంపించారు.
తప్పుడు తేదీని గుర్తించిన కంపెనీ రఘును ఇండియాకు పంపించేందుకు నిరాకరించింది. అంతేకాకుండా చీటింగ్ చేశావని ఆరోపిస్తూ చర్యలకు ఉపక్రమించింది. అయితే రఘు విషయాన్ని మళ్లీ బంధువుల దృష్టికి తీసుకురావడంతో తప్పిదాన్ని గుర్తించిన సిబ్బంది సరైన తేదీతో మరో డిక్లరేషన్ సర్టిఫికెట్ అందజేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.