మామా అల్లుళ్ల మధ్య గొడవ.. గన్​తో బెదిరించిన మామ

మామా అల్లుళ్ల మధ్య గొడవ.. గన్​తో బెదిరించిన మామ
  •     కింద పడడంతో చూసి  బెదిరిపోయిన స్థానికులు
  •     ములుగు పెట్రోల్​బంకు వద్ద ఘటన
  •     లైటర్ ​గన్​ అని క్లారిటీ ఇచ్చిన పోలీసులు..కేసు నమోదు 

ములుగు, వెలుగు :  ములుగులోని ఓ పెట్రోల్​ బంకులో మామ, అల్లుళ్లు గొడవ పడగా అల్లుడిని బెదిరించేందుకు మామ గన్​ తీయడం కలకలానికి దారి తీసింది. పెనుగులాటలో అది దూరంగా పడిపోవడంతో బంకులో ఉన్న కస్టమర్లు, రోడ్డున పోయేవారు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఇద్దరినీ స్టేషన్​కు తరలించారు. చివరకు మామ దగ్గరున్నది లైటర్​ గన్​అని తేల్చారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ములుగుకు చెందిన పోరిక మోహన్​లాల్​ ప్రభుత్వ టీచర్. ఈయన కూతురికి 2016లో ములుగు మండలం బండారుపల్లికి చెందిన బానోతు శరత్​ అనే సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్​తో పెండ్లయ్యింది. వీరికి ఆరేండ్ల బాబు ఉన్నాడు. దంపతులిద్దరి మధ్య గొడవలతో మూడేండ్లుగా శరత్, ఇతడి భార్య కలిసి ఉండడం లేదు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. సమస్యను పరిష్కరించుకునేందుకు కోర్టును కూడా ఆశ్రయించారు. 

సోమవారం మధ్యాహ్నం ములుగులోని ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంకు వద్ద శరత్ కనిపించడంతో ఇతడి మామ మోహన్​లాల్ దగ్గరకు వెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య లొల్లి ముదరడంతో మోహన్​లాల్​ శరత్ ను బెదిరించేందుకు గన్​ తీశాడు. శరత్​ అడ్డుకోబోగా పెనుగులాట జరిగి గన్ ​దూరంగా పడిపోయింది. దీంతో పెట్రోల్ ​పోసుకోవడానికి వచ్చిన వారు, రోడ్డుపై  నిలబడి ఈ గొడవ చూస్తున్న వారు భయపడ్డారు. కొంతమంది ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేయగా శరత్ 100కు డయల్​ చేసి విషయం చెప్పాడు. ములుగు సీఐ రంజిత్ కుమార్​, ఎస్సై వెంకటేశ్వర్​ బంకు వద్దకు వచ్చి గన్​ స్వాధీనం చేసుకొని ఇద్దరినీ పోలీస్​స్టేషన్​కు తరలించారు. గన్​ ను పరిశీలించి అది లైటర్ ​గన్ గా తేల్చారు. అల్లుడిని బెదిరించడానికే మామ ఈ పని చేశాడని తెలుసుకున్నారు. శరత్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటేశ్వర్​ తెలిపారు.