- మానసిక స్థితి సరిగ్గా లేక దిక్కుతోచని కుటుంబం
- పైగా ఆర్థిక ఇబ్బందులు..
- చేయూతనందించిన స్వచ్చంద సంస్థ, పోలీసులు
- షాపూర్‌నగర్‌లో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ఇంటి పెద్ద చనిపోగా మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులతో మూడ్రోజులు ఇంట్లోనే మృతదేహంతోనే ఓ కుటుంబం గడిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన స్వామి దాసు(76)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కొన్నేండ్ల కింద సిటీకి వలస వచ్చారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్నియోజకర్గం షాపూర్‌నగర్‌లోని ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నారు. స్వామి దాసు ఆర్యోగం బాగా లేకపోవడంతో ఇటీవల ఇంటికే పరిమితమయ్యాడు.
ఇంట్లో సంపాదించేవారు లేకపోవడం, ఆసుప్రతిలో చూపించుకోలేక అనారోగ్యంతోనే 9 రోజుల కింద మృతిచెందాడు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని కుటుంబ సభ్యులు స్వామిదాసు మృతదేహంతోనే మూడు రోజులు ఇంట్లోనే గడిపారు. ఆ తర్వాత ఈ విషయం ఇంటి ఓనర్‌కు తెలవడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించి సత్యహరిచంద్ర అనే సంస్థ ద్వారా అంత్యక్రియలు జరిపించారు.
అయినప్పటికీ స్వామి భార్య, ఇద్దరు అమ్మాయిల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో నుంచి బయకు రావడం లేదు. చుట్టుపక్కల వారు పలకరించినా.. ఏమిచ్చినా తినకుండా భయంభయంగా ప్రవర్తించారు. దీంతో వారిని పోలీసులు శనివారం రాణిగంజ్‌లోని హోమ్ ఫర్ డిజబుల్లో చేర్పించారు.
