ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో పిటిషన్

ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హత్యాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడంపై బాధిత రైతు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందుతుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు జనవరి 18న బెయిల్ మంజూరు చేసింది. అయితే దాన్ని రద్దు చేయాలంటూ బాధిత కుటుంబాల తరఫున అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. బెయిల్ మంజూరుకు సంబంధించి జనవరి 18న జరిగిన విచారణలో బాధితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో వీడియో లింక్ డిస్ కనెక్ట్ అయిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. తిరిగి కనెక్ట్ చేయాలంటూ కోర్టు సిబ్బందికి పలుమార్లు ఫోన్ కాల్స్ చేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయకపోవడంతోనే బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటీషన్ లో విన్నవించారు. 

ఇదిలా ఉంటే ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటీషన్ దాఖలైంది. బెయిల్ రద్దు చేయాలంటూ అడ్వొకేట్ శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లఖింపూర్ ఖేరీ కేసు విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెంటనే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాదులు కోరారు. సిట్ కేసును బలంగా ప్రెజెంట్ చేయనందునే అలహాబాద్ కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిందని అడ్వొకేట్ శివ కుమార్ ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు దర్జాగా బయట తిరుగుతుండగా.. బాధిత కుటుంబాలు భయంతో బతుకుతున్నాయని అన్నారు. గతేడాది అక్టోబర్ 3న యూపీలోని లఖింపూర్‌ ఖేరీలో శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న రైతులను ఆశిష్‌ మిశ్రా కారుతో తొక్కించారు. ఈ ఘటనలో నలుగురు అన్నదాతలతో పాటు ఆరుగురు మరణించారు.

మరిన్ని వార్తల కోసం..

 

దాణా స్కాంలో లాలూ ప్రసాద్కు శిక్ష ఖరారు