6 నిమిషాల్లో ఇంటికొచ్చిన బ్లింకిట్ అంబులెన్స్.. మహిళ ప్రాణాలు ఎలా కాపాడిందో చూడండి..

6 నిమిషాల్లో ఇంటికొచ్చిన బ్లింకిట్ అంబులెన్స్.. మహిళ ప్రాణాలు ఎలా కాపాడిందో చూడండి..

10 నిమిషాల్లో కూరగాయలు, స్నాక్స్, ఫుడ్ కంటే అంత తక్కువ సమయంలో అంబులెన్స్ వస్తే ఎలా ఉంటది. అవును జొమాటో సంస్థకు చెందిన బ్లింకిట్ సంస్థ అందిస్తున్న అంబులెన్స్ సేవల స్పీడ్ కూడా రెప్పపాటులోనే ఉంది. దేశరాజధాని ఢిల్లీలో బ్లింకిట్ అంబులెన్స్ వచ్చిన వేగం ఒక మహిళ ప్రాణాలను ఎలా సరైన సమయంలో కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నేటి ఆధునిక ప్రపంచంలో 'వేగం' అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. కొన్నిసార్లు అది ప్రాణాలను కాపాడే సంజీవనిగా మారుతుంది. 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేసే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'బ్లింకిట్'.. ఇప్పుడు అత్యవసర వైద్య సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. దీనిపై ఢిల్లీకి చెందిన శివం కుక్రేజా అనే యువకుడి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా.. టెక్నాలజీ బాధ్యతాయుతంగా పనిచేస్తే కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ప్రపంచానికి చాటిచెప్పింది.

ALSO READ : భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం

శివం కుక్రేజా బామ్మ ఒకరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండె కొట్టుకుంటున్నప్పటికీ ఆమె స్పృహలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112కి ఫోన్ చేసినా అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. ప్రాణాపాయ స్థితిలో నిమిషాలు గడుస్తున్న కొద్దీ భయం పెరుగుతున్న సమయంలో.. శివంకు బ్లింకిట్ యాప్‌లో ఉన్న అంబులెన్స్ ఫీచర్ గుర్తొచ్చింది. వెంటనే దానిని బుక్ చేయగా యాప్ కేవలం 6 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందని చూపించింది. ఆశ్చర్యకరంగా.. కేవలం ఒక నిమిషంలో కన్ఫర్మేషన్ కాల్ రావడం, మరో నాలుగు నిమిషాల్లో ఇద్దరు నర్సులతో కూడిన అంబులెన్స్ వారి గుమ్మం ముందుకు చేరుకోవడం చకాచకా జరిగిపోయింది.

బ్లింకిట్ అంబులెన్స్ లో అక్కడికి చేరుకున్న మెడికల్ టీం వెంటనే ఆమె రక్తపోటు, షుగర్ లెవల్స్ పరీక్షించగా.. బ్లడ్ షుగర్ 40కి పడిపోయిందని గుర్తించారు. వెంటన్ అత్యవసర చికిత్స అందించడంతో 10 నిమిషాల్లోనే ఆమెకు స్పృహ వచ్చింది. ఆ తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చక్కబడ్డాక శివం డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించగా.. ఆ సిబ్బంది చెప్పిన సమాధానం అతడిని ఆశ్చర్యపరిచింది. ఇది బ్లింకిట్ నమ్మకానికి గుర్తు.. మేము ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని వారు చెప్పిన సమాధానం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది అతడిని. కనీసం టిప్ తీసుకోవడానికి కూడా వారు నిరాకరించారు. ఈ పోస్టుపై స్పందించిన దీపిందర్ గోయల్ తమ ప్రయత్నం నిజంగా ప్రయోజనకరంగా మహిళ ప్రాణాలు కాపాడటంపై హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ : పాత iPhone 4 ఫోన్లకు పిచ్చ డిమాండ్..

10 నిమిషాల డెలివరీ మోడల్‌పై సమాజంలో ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ.. ఇలాంటి అత్యవసర సమయాల్లో ఆ వేగమే ప్రాణదాతగా మారుతోందని ఈ ఘటన నిరూపించింది. ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్న చోట.. ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావడాన్ని అందరూ కొనియాడుతున్నారు. టెక్నాలజీని సరైన ఉద్దేశంతో వాడితే అది కేవలం వ్యాపారమే కాదు, మానవత్వాన్ని చాటే అద్భుత సాధనం అవుతుందని బ్లింకిట్ తన అంబులెన్స్ సర్వీసులతో నిరూపించిందని సోషల్ మీడియాలో యూజర్లు అంటున్నారు.