పాత iPhone 4 ఫోన్లకు పిచ్చ డిమాండ్.. 16 ఏళ్ల తర్వాత దానిలో జెన్ జెడ్ ఇష్టపడుతోంది ఇదే..

పాత iPhone 4 ఫోన్లకు పిచ్చ డిమాండ్.. 16 ఏళ్ల తర్వాత దానిలో జెన్ జెడ్ ఇష్టపడుతోంది ఇదే..

కొత్త టెక్నాలజీకి డిమాండ్ అలాగే సప్లై రెండూ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త రకం ఫోన్లు వచ్చేస్తున్నాయి. బ్యాటరీ ఎక్కువ ఉండేది, గేమ్స్ కోసం ఒకటి, సేఫ్టీ కోసం ఒకటి, స్పీడు కోసం మరొకటి, కెమెరా ఫీచర్ల కోసం ఇంకోటి అంటూ రకరకాల కంపెనీల నుంచి బోలెడన్ని స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి మార్కెట్లో. కానీ వీటిని వాడీ వాడీ విసిగిపోయిన చాలా మంది కుర్రకారు మదిలో కొత్త ఆలోచన పుడుతోంది. అదే పాత ఐఫోన్ 4 ఫోన్లకు డిమాండ్ పెంచేస్తోందంటా. జెన్ జెడ్ కుర్రకారు నుంచి స్టార్ట్ అయిన కొత్త క్రేజీ మెుబైల్ ట్రెండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

లేటెస్ట్ టెక్నాలజీ విసిగిస్తున్న తరుణంలో.. నేటి తరం యువత తమ భవిష్యత్తు కోసం గతాన్ని తవ్వుతోంది. సరికొత్త ఫీచర్లు, శక్తివంతమైన కెమెరా ఉన్న ఫోన్లను కాదని.. 16 ఏళ్ల క్రితం నాటి iPhone 4 వైపు వెళ్లటం కొత్త ట్రెండ్ కి నాంది పలికింది. 2010లో అద్భుతమైన ఆవిష్కరణగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐఫోన్ 4.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. చాలా మంది ఆ పాత ఐఫోన్ మోడల్ ఇష్టపడటానికి అసలు కారణం అది అంత శక్తివంతమైనది కాకపోవటమేనట. నేటి కాలం ఫోన్లలో హైఎండ్ ఫీచర్లు వాడేసిన చాలా మంది యూత్ తక్కువ ఫీచర్స్ ఉన్న సింపుల్ గ్యాజెట్ గా పాత ఐఫోన్ ని చూస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దాని పరమితులే దాని క్రేజ్ కి కారణంగా మారటం గమనార్హం. 

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఐఫోన్ 4 కెమెరాతో తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నేటి స్మార్ట్‌ఫోన్లు క్రిష్టల్ క్లియర్ ఫోటోలు ఇస్తుంటే.. ఐఫోన్ 4 మాత్రం కాస్త మసకగా, పాతకాలపు అనుభూతిని ఇచ్చే చిత్రాలను అందిస్తుంది. ఈ గ్రెయినీ లుక్ ఫోటోలు మరింత సహజంగా, భావోద్వేగపూరితంగా ఉన్నాయని యూత్ భావిస్తోంది. అందుకే దీనిని ఒక డిజిటల్ కెమెరాగా పరిగణిస్తూ.. ఆ 'వైబ్' మరే ఫోన్‌లోనూ దొరకదని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, ఐఫోన్ 4 కొనుగోలు కోసం చేసే సెర్చ్‌లు ఏకంగా 1000 శాతం పెరిగాయి. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే, ఈబే వంటి సైట్లలో పాత ఐఫోన్ 4 మోడళ్లు, ముఖ్యంగా ఒరిజినల్ బాక్స్‌తో ఉన్నవి భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి. 16 ఏళ్ల నాటి పరికరానికి ఈ స్థాయిలో ఆదరణ రావడం అందరినీ ప్రస్తుతం ఆశ్చర్యపరుస్తోంది.

అయితే ఈ వింటేజ్ ప్రేమలో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఫోన్ 4 కేవలం 'iOS 7.1.2' వెర్షన్‌పై మాత్రమే పనిచేస్తుంది. ఇది పాత సాఫ్ట్‌వేర్ కాబట్టి.. ఇందులో ఎటువంటి సెక్యూరిటీ అప్‌డేట్లు ఉండవు. ఆధునిక సైబర్ దాడుల నుంచి ఈ ఫోన్ రక్షణ కల్పించలేదు. కేవలం ఫోటోలు తీసుకోవడానికి లేదా పాత జ్ఞాపకాల కోసం వాడితే పర్వాలేదు కానీ.. మెయిన్ ఫోన్‌గా వాడటం భద్రత పరంగా రిస్క్ అని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా.. మనిషి మనసు మాత్రం అప్పుడప్పుడు పాత జ్ఞాపకాల తీపిలోనే సేదతీరాలని కోరుకుంటుందని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది. దీంతో ఈ పాత ఫోన్లను కొందరు ఆన్ లైన్ ల ో 10వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.9 లక్షలకు అమ్మేందుకు పెడుతున్నారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.