
దంపతుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామనకున్నారు. కానీ తాము చనిపోతే తన మేనల్లుడు అనాథ అవుతాడని భావించారు. దీంతో ముగ్గురూ కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. భార్య, మేనల్లుడిని చెరువలోకి తోసేసిన భర్త తర్వాత తానూ అందులోకి దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్త, మేనల్లుడి చనిపోగా..భార్య ప్రాణాలతో బయటపడింది. కూకట్ పల్లి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఆత్మహత్య యత్నానికి సంబంధించిన వివరాలను ఎస్సై రవీందర్ రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన ఉప్పు రాజు(26) తన భార్య తులసితో కలిసి భాగ్యనగర్ లోని తులసీవనంలో ఉంటున్నాడు. రాజు కూలీ పనిచేసేవాడు. రాజు సోదరి కుమారుడు ప్రసాద్(14)కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతడి వద్దే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 9 గంటలకు రాజు అతడి భార్య మధ్య గొడవ జరగడంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. తాము ఆత్మహత్య చేసుకుంటే మేనల్లుడు ప్రసాద్ అనాథ అవుతావడని భావించిన రాజు..భార్యతో పాటు అతడిని కూడా తీసుకుని భాగ్యనగర్ లోని ఎల్లమ్మ బండ చెరువు వద్దకు చేరుకున్నాడు. ముగ్గురు కలిసి చనిపోవాలని అనుకున్నారు. మొదట రాజు తన భార్య, మేనల్లుడిని చెరువలోకి తోసేశాడు. తర్వాత అతనూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో రాజు భార్య తులసి ప్రాణాలతో చెరువు నుంచి బయటకు వచ్చింది. రాజు, అతడి మేనల్లుడు ప్రసాద్ ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. స్థానికులు కూకట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో మునిగిన రాజు, ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలించగా..నీటిలో రాజు డెడ్ బాడీ దొరికింది. బుధవారం చీకటి పడినా ప్రసాద్ డెడ్ బాడీ దొరక్కపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు నిలిపివేశారు. గురువారం ఉదయం ప్రసాద్ డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రసాద్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.