ఎంపీ సంతోష్ తండ్రి ఇంటి ముందు దళిత కుటుంబం నిరసన

ఎంపీ సంతోష్ తండ్రి ఇంటి ముందు దళిత కుటుంబం నిరసన

కరీంనగర్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు మోసం చేశాడంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కత్తెరపాక శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంతో సహా నిరసనకు దిగాడు. సిరిపురం కాలనీలోని రవీందర్ రావు ఇంటి ప్రహారీ గోడకు ఫ్లెక్సీ కట్టి తల్లీ, భార్య, పిల్లలతో కలిసి గేటు వద్ద బైఠాయించాడు. ప్రొక్లెయినర్ కొనిచ్చేందుకు తనవద్ద కమీషన్ తీసుకున్న రవీందర్ రావు.. తన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మరికొంత సొమ్ము తీసుకుని మోసం చేశాడని బాధితుడు వాపోతున్నాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో రవీందర్ రావు ఇంటి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరనస చేపట్టారు. 

బాధితుడు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని స్టేషన్కు రావాలని చెప్పారు. అందుకు శ్రీనివాస్ అతని కుటుంబసభ్యులు అంగీకరించడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ డబ్బు ఇప్పించేలా చూడాలని బాధితులు పోలీసులు కాళ్లు మొక్కినా పట్టించుకోకుండా వారిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. తండ్రిని పోలీసులు బలవంతంగా పోలీస్ వాహనంలో తరలించడాన్ని చూసిన అతని కూతుళ్లు భయంతో రోదించారు.