రాజ్యం ఏలుడు కాదు..  విజ్ఞత ఉండాలి... కేటీఆర్.. నీ గతమేందో మరిచినవా? 

రాజ్యం ఏలుడు కాదు..  విజ్ఞత ఉండాలి... కేటీఆర్.. నీ గతమేందో మరిచినవా? 
  • రాజ్యం ఏలుడు కాదు..  విజ్ఞత ఉండాలి
  • కేటీఆర్.. నీ గతమేందో మరిచినవా? 
  • ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు ఫైర్ 
  • అపాయింట్ మెంట్ అడిగితే..  40 రోజులుగా ఇవ్వవా? 
  • అత్యంత ఉన్నత  వ్యక్తులను అణచివేస్తరా? 
  • నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి..  నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు
  • ‘ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు’ అంటూ ఆగ్రహం
  • సోషల్ మీడియాలో  బహిరంగ లేఖ పోస్టు 

హైదరాబాద్, వెలుగు:  మాభూమి, దాసి లాంటి చిత్రాలతో తెలంగాణ సినిమాకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బి.నర్సింగరావు.. మంత్రి కేటీఆర్​ తీరుపై ఫైర్​అయ్యారు. ‘‘కేటీఆర్.. మీ గతం మరిచారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా అడుగుతున్నా అపాయింట్​మెంట్​ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేటీఆర్​కు సోషల్ మీడియా వేదికగా నర్సింగరావు బహిరంగ​ లేఖ​ రాశారు. నర్సింగరావు ఏ అంశాలపై చర్చించేందుకు కేటీఆర్​అపాయింట్​మెంట్​ కోరారో? ఆయనను కలిసేందుకు కేటీఆర్​ ఎందుకు నిరాకరించారో? తెలియదు గానీ.. ఇప్పుడిది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నర్సింగరావు రాసిన లెటర్ లో ఏముందంటే.. ‘‘వాడు నచ్చాడా కేటీఆర్​ నీకు.. నేను నచ్చలేదా.. ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు.. నలభై రోజుల నుంచి ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్​మెంట్​ అడిగితే నువ్వు నాకు అపాయింట్​మెంట్​ఇవ్వవా.. నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు’’ అని పేర్కొన్నారు. 

‘‘అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణచి వేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు.. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు.. అంతగొప్ప ఏలిక నీది.. ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు.. మీ గత జాడలు (అడుగుల) ఆనవాళ్లు మరిచారా.. ఇవన్నీ రేపు  బహిరంగంగా మాట్లాడుకుందాం” అని కేటీఆర్​పై నర్సింగరావు మండిపడ్డారు. 

తెలంగాణ సినిమాకు ఖ్యాతి తెచ్చిన దర్శకుడు.. 

నర్సింగరావు దశాబ్దాల క్రితమే తన సినిమాలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు. మా భూమి, దాసి, మట్టి మనుషులు సహా ఎన్నో ప్రఖ్యాత సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కవిగా నర్సింగరావుకు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలంగాణ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన గొప్ప దర్శకుడు. తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పని చేశారు. నర్సింగరావు సినిమాలకు నాలుగు నేషనల్​అవార్డులు దక్కాయి. కైరో, సిడ్నీ, మాస్కో ఫిలిమ్​ఫెస్టివల్స్​లో ఆయన సినిమాలు ప్రదర్శించారు. నర్సింగరావు ‘హరివిల్లు’ అనే బాలల సినిమాకు నంది అవార్డు సొంతం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్ట్​ఎట్​తెలంగాణ, బోనాలు, మేడారం జాతర లాంటి రాష్ట్ర సంస్కృతి, వైభవాన్ని చాటే చిత్రాలతో కాఫీ టేబుల్​బుక్​లతో పాటు ప్రత్యేక సంకలనాలు ప్రచురించారు. తెలంగాణ ప్రచురణల పేరుతో సాహిత్య గ్రంథాలు పబ్లిష్​చేశారు. 

ఉద్యమకారులకు నో అపాయింట్ మెంట్.. 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన నర్సింగరావు..  రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణంలోనూ అంతే కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్​అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారుతో కలిసి పనిచేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రయారిటీలు మారడంతో ఉద్యమకారులకు ప్రగతి భవన్​గేట్లు తెరుచుకోవడం బంద్​అయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన.. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను హేళన చేసిన ఆంధ్ర ప్రాంత నటులు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులకు మాత్రం ప్రగతి భవన్​లో రెడ్​కార్పెట్​వేసి స్వాగతం​పలికారు. కొన్ని రోజుల కింద హీరో శర్వానంద్​సీఎం కేసీఆర్​ను కలిసి తన వివాహ విందుకు ఆహ్వానించారు. 

శర్వానంద్​రిసెప్షన్​కు మంత్రి కేటీఆర్​అటెండ్​అయ్యారు. హీరోలు చిరంజీవి, నాగార్జున, పవన్​కల్యాణ్​సహా పలువురు సినీ ప్రముఖులను కేసీఆర్, కేటీఆర్​పలు సందర్భాల్లో కలిశారు. కేసీఆర్​వాళ్లను ప్రగతి భవన్​కు పిలిపించి చర్చించిన సందర్భాలెన్నో ఉన్నాయి.తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్లకు అపాయింట్​మెంట్​ఇవ్వకుండా, తెలంగాణను అవహేళన చేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఉద్యమకారులు గుర్రుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే నర్సింగరావు సోషల్​మీడియాలో బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కేటీఆర్​ఆఫీస్​లో ఉన్న వాళ్లపైనా నర్సింగరావు విమర్శలు చేశారు. కేటీఆర్​ను కలవకుండా ఆయన పేషీలో ఉన్న కొందరు వ్యక్తులు అడ్డుపడుతారని గులాబీ పార్టీ లీడర్లు బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు వ్యక్తులపై మంత్రికి నేరుగా కంప్లయింట్​చేశారు కూడా. కానీ ఆయన చర్యలేమీ తీసుకోలేదు. ఇప్పుడు నర్సింగరావు బహిరంగ లేఖతో మంత్రి కేటీఆర్​ఆఫీస్, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులపై మరోసారి చర్చ జరుగుతోంది.