సంజూ శాంసన్పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష..?

సంజూ శాంసన్పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష..?

వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మరోసారి మొండి చేయ్యి ఎదురైంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సెలక్ట్ అయినా..సంజూకు తుది జట్టులో స్థానం దక్కలేదు. రెండు మ్యాచుల్లో అతనికి అవకాశమే ఇవ్వలేదు. సంజూను కాదని..తుదిజట్టులోకి తీసుకున్న పంత్..దారుణంగా విఫలమయ్యాడు. దీంతో శాంసన్ను కావాలనే విస్మరిస్తున్నారన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

తుది జట్టులో నో ఛాన్స్..
టీ20 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియాకు సంజూ శాంసన్ను ఎంపిక చేయాలని విపరీతమైన డిమాండ్ ఉంది. అయినా బీసీసీఐ సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్ల కోసం ఎంపిక చేసిన జట్టులో శాంసన్కు కనీసం చోటివ్వలేదు. ఇక టీ20 వరల్డ్ కప్ జట్టులో అయినా ఛాన్స్ వస్తుందని ఆశించాడు. కానీ అక్కడ కూడా మొండి చెయ్యే ఎదురైంది. ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం అనంతరం సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటారని భావించారు. అనుకున్నట్లే న్యూజిలాండ్ టీ20 సిరీస్లో సంజూ స్థానం దక్కించుకున్నాడు. కానీ తుది జట్టులో మాత్రం సంజూకు ప్లేస్ ఇవ్వలేదు. 

పంత్నే నమ్ముకున్న మేనేజ్ మెంట్..
న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికైన సంజూను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, కీపర్ దినేశ్ కార్తీక్ వంటి వాళ్లు సూచించారు. కానీ  టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చింది.  ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చినా  పంత్ రాణించలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ చివరి రెండు మ్యాచుల్లో పంత్ తుది జట్టులోకి వచ్చినా విఫమయ్యాడు. తాజాగా జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో పంత్ను ఓపెనర్‌గా ఆడించినా ఫలితం లేదు.  తొలి మ్యాచ్ రద్దయింది. ఇక రెండో టీ20లో పంత్ కేవలం 6 పరుగులే చేశాడు. చివరి మ్యాచులో 11 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. 

అభిమానుల ఆగ్రహం..
సంజూ శాంసన్కు అవకాశం దక్కకపోవడంపై  ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడిచినా.. కెప్టెన్లు మారినా.. సంజూ శాంసన్‌ రాత మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఎంపికలో బీసీసీఐ ఫేవరెటిజం చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. తమకు నచ్చిన ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్నా..పంత్‌కు  ఇంకెన్ని అవకాశాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఫాంలో ఉన్న  సంజూ శాంసన్ పై బీసీసీఐ వివక్ష ఎందుకు చూపిస్తుందో అర్థం కావడం లేదంటున్నారు.