మిడ్జిల్ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో రైతు ఆత్మహత్యాయత్నం

 మిడ్జిల్ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో రైతు ఆత్మహత్యాయత్నం

మిడ్జిల్, వెలుగు: మిడ్జిల్ తహసీల్దార్​ఆఫీస్‎లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ ముందే పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్‌‌ననగర్‌‌ జిల్లా మిడ్జిల్‌‌ మండలంలోని వాడ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య తల్లితో కలిసి సోమవారం తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు వచ్చాడు. తమకు సర్వే నంబర్ 156లో 3 గుంటల పట్టా భూమి ఉందని, దీనికి సంబంధించిన పాస్ బుక్​ ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు పొజిషన్‌‌లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా, గమనించిన సిబ్బంది బాటిల్‌‌ను లాక్కున్నారు. అనంతరం పొలానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పొలంలోకి రానివ్వని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తహసీల్దార్‌‌ సూచించారు. ఎస్సైతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని తహసీల్దార్‌‌ రాజు హామీ ఇచ్చారు.