
జూబ్లీహిల్స్, వెలుగు: రూ.వందల కోట్లతో ఫాంహౌస్ కట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్.. పేద లకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ రూ.లక్షల కోట్లు దోచుకున్నదని మండిపడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్‌లో రూ.4.66 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులకు మేగర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్ తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులు ఊబిలోకి నెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, అవే డబ్బులతో రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి గూడు కల్పించే అవకాశం ఉండేదన్నారు. పేదలను బీఆర్ఎస్ ప్రభుత్యం మోసం చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు.
రహమత్ నగర్ డివిజన్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నామని వెల్లడించారు. స్థానికంగా ఉన్న హైటెన్షన్ తీగల వల్ల గతంలో అనేకమంది చనిపోయారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పారు. అనంతరం షేక్‌పేట్‌లోని మారుతి నగర్, వినోబ నగర్, షేక్ పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్, సీసీ రోడ్లు, ఇందిరా గాంధీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫ్లోరింగ్ పనుల నిర్మాణం కోసం సుమారు రూ.1.06 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు.