- ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఘటన
ములుగు, వెలుగు : అడవి పందుల దాడి నుంచి తప్పించుకోబోయి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో బుధవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి (65) తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డిపై అడవి పందులు దాడి చేశాయి. వాటిని తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న కుంటలో పడ్డాడు. వెంకటేశ్వర్‌రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా కుంటలో చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
