రైతు వేదికలు.. టీఆర్​ఎస్​ ఆఫీసులైతయ్

రైతు వేదికలు.. టీఆర్​ఎస్​ ఆఫీసులైతయ్

ఎమ్మెల్సీగా గెలిపిస్తే పేదోళ్ల  గొంతుకనవుతా: తీన్మార్​ మల్లన్న

కేసీఆర్​ సర్కార్​ చేసిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్త

మాట నిలుపుకోకుంటే రెండున్నరేండ్లలో రాజీనామా చేస్త

కోదండరాం, కేసీఆర్​ది చీకటి ఒప్పందం అని విమర్శ

జనగామలో పాదయాత్ర స్టార్ట్

జనగామ, వెలుగు: ‘‘కోదండరాం, కేసీఆర్​ది చీకటి ఒప్పందం. ఉత్తమ్​ కుమార్​ రెడ్డి,  కేసీఆర్​ను ఒకే గదిలోకి పంపితే కొట్టుకోరు.. కలిసి మందు తాగుతరు.  కేసీఆర్​ సర్కార్​ చేసిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్త” అని తీన్మార్​ మల్లన్న అన్నారు.  తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్  కరిచే కుక్క అయ్యారని మండిపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తే బాబా సాహెబ్ అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగంతో న్యాయంగా కొట్లాడుతున్నానన్నారు. గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పాదయాత్రను ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాల వేసి తీన్మార్​ మల్లన్న  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రైతు వేదికలు రైతుల కోసం కాదు.. అవి టీఆర్ఎస్ కార్యాలయాలుగా మారుతయ్​. ఫాం హౌస్​లో పండుకునే ముఖ్యమంత్రికి లక్షల జీతం, కరోనా టైంలో కష్టపడుతున్న 108 అంబులెన్స్​ సిబ్బంది కి తొమ్మిది వేల జీతమా?.. ఆ తొమ్మిది వేల జీతం కూడా ఆరునెలలుగా పెండింగ్​ ఉంది. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. ఎవరు మెసిలినా బయట పెట్టుడే” అని హెచ్చరించారు. తనకు పదవులు ముఖ్యం కాదని,  అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించడం కోసమే పోరాటం చేస్తున్నానన్నారు. చనిపోయే ముందు తన ఒంటిపై బట్టలే ఆస్తులుగా ఉండాలని, బతికినన్ని రోజులు మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటానని  పేర్కొన్నారు. ఖమ్మం– వరంగల్​– నల్గొండ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్​ అభ్యర్థిగా బరిలో దిగానని స్పష్టం చేశారు.

పేదోళ్లు, నిరుద్యోగుల గొంతుకనవుతా

తనను గెలిపిస్తే చట్ట సభల్లో పేదోళ్లు, నిరుద్యోగుల గొంతుకనవుతానని తీన్మార్​ మల్లన్న అన్నారు. మాట నిలుపుకోకుంటే రెండున్నరేండ్లలో రాజీనామా చేస్తానని చెప్పారు. కేసీఆర్ గల్లీకో ఎమ్మెల్యే ను పెట్టినా తన గెలుపు ఆగదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను రాజులను చేయడానికే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక డమ్మీ అని, కట్టప్ప అని మల్లన్న విమర్శించారు.

మేనేజ్​మెంట్​ కోటాలో కవితకు ఎమ్మెల్సీ సీటు

ఇంటికి ఒకే  పింఛన్​ ఇస్తున్న కేసీఆర్ తన ఇంట్లో మాత్రం రెండు పదవులు ఎట్ల తీసుకుంటారని తీన్మార్​ మల్లన్న ప్రశ్నించారు. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​లో ఫైయిలైనా మేనేజ్​మెంట్​ కోటాలో సీటిప్పించినట్లు కవితకు కేసీఆర్​ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని ఆయన విమర్శించారు. ఖమ్మం, వరంగల్​, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో 50 రోజుల్లో 1,600  కిలోమీటర్ల పైన పాదయాత్ర జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్స్​ను కలవడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. పాదయాత్రకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.