గొర్రెల దొంగలనుకొని గొడ్డలితో దాడి చేసిన రైతు

గొర్రెల దొంగలనుకొని గొడ్డలితో దాడి చేసిన రైతు

ధర్మసాగర్, వెలుగు :  గొర్ల దొంగతనానికి వచ్చి తన కొడుకును కొడుతున్నాడన్న ఆవేశంలో ఓ తండ్రి ఆ యువకుడిపై గొడ్డలితో దాడి చేయగా.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం సాయిపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపేటకు చెందిన దద్ది రాజయ్య వ్యవసాయం చేస్తూ గొర్లు కాస్తున్నాడు. తన పొలం వద్దే ఉన్న కంచె ఏర్పాటు చేసి అక్కడే మంద పెడుతున్నాడు.

ఎప్పట్లాగే రాజయ్య తన కొడుకు మహేందర్​ తో కలిసి గొర్లను కంచెలోకి పంపించి, తమ పొలం వద్ద ఉన్న పత్తి బస్తాలు ఇంటి వద్ద వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎల్కతుర్తి గోపాలపూర్​ కు చెందిన గండికోట లక్ష్మణ్​(28), గండికోట శేఖర్, సూర శ్రీకాంత్, గండికోట రమేశ్  అదే సమయంలో రాజయ్య గొర్ల మంద వైపు వెళ్లారు. అప్పటికే రాజయ్య, మహేందర్​ ఇంటి నుంచి తిరిగి గొర్ల మంద వద్దకు వస్తుండగా.. గొర్లు బెదురుతూ అరవడం ప్రారంభించాయి. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన మహేందర్..​ వెంటనే  వారి వద్దకు పరుగులు తీశాడు.  

దీంతో శేఖర్, శ్రీకాంత్, రమేశ్​ పరారు కాగా.. లక్ష్మణ్​ మాత్రమే మహేందర్ కు చిక్కాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. మహేందర్​ పై లక్ష్మణ్​ దాడిచేస్తుండగా గమనించిన తండ్రి రాజయ్య కంగారు పడ్డారు. గొర్ల దొంగతనానికి వచ్చి తన కొడుకునే కొడుతున్నాడనే ఆవేశంలో రాజయ్య గొడ్డలి తీసుకొని లక్ష్మణ్​ పై దాడి చేశాడు. దీంతో లక్ష్మణ్​ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత రాజయ్య స్థానిక పోలీస్ స్టేషన్​ లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మణ్​ డెడ్ బాడీని ఎంజీఎంకి తరలించారు.

కాగా లక్ష్మణ్​​ తన స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి సాయిపేట గ్రామంలోని తమ బంధువు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి షికారుకు వెళ్లారని, వారిని చూసి గొర్రెలు అరవడంతో దొంగలుగా భావించి గొడ్డలితో నరికి చంపారని మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ధర్మసాగర్  సీఐ శ్రీధర్​ రావు తెలిపారు.