సీడ్​ కోసం.. పైసల కోసం రోడ్ల మీద రైతులు

సీడ్​ కోసం.. పైసల కోసం  రోడ్ల మీద రైతులు

కరీంనగర్, వెలుగు:  నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు పడుతున్నాయి. తొలకరి వర్షాలతో పొలం పనుల్లో బిజీబిజీగా ఉండాల్సిన రైతులు  రోడ్ల మీదకు వస్తున్నారు. చాలాచోట్ల ఇంకా వడ్ల కొనుగోలు పూర్తి కాలేదు. వడ్లు అమ్ముకునేందుకు కొంతమంది..  ఖాతాల్లో పడ్డ పైసలు తీసుకునేందుకు మరికొందరు.. విత్తనాల కోసం ఇంకొందరు..  బ్యాంకుల ముందు, షాపుల ముందు క్యూ కడ్తున్నారు. బ్యాంకుల్లో లిమిటెడ్​క్యాష్​ ఇస్తుండడం, విత్తనాలు సరిపడా లేకపోవడం, ఎప్పట్లాగే వడ్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు.

మూడు వేల సెంటర్లలో వడ్ల కుప్పలు 

రాష్ట్రంలో  వడ్లను కొనుగోలు చేసేందుకు  మొత్తం 6,962 సెంటర్లను ప్రారంభించారు. ఇందులో మూడు వేల సెంటర్లలో ఇంకా కొనుగోలు ప్రక్రియ కంప్లీట్​కాలేదు. ఇప్పటివరకు 84.51 లక్షల టన్నుల వడ్లను సేకరించగా.. ఇందులో 2.82 లక్షల టన్నుల వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. మొత్తం 13 లక్షల మంది రైతులు వడ్లు అమ్ముకున్నారు.  వడ్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం  రూ. 1,100  కోట్లు రిలీజ్​ చేసింది. అయితే.... ఇప్పటివరకు వడ్లు అమ్ముకున్న  9.5 లక్షల మంది వివరాలు ఆన్​లైన్​లో నమోదుకాగా.. ఇందులో  7.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడ్డాయి. మరో రెండు లక్షల మంది డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. చాలాచోట్ల వడ్ల కుప్పలు ఇంకా సెంటర్లలోనే ఉండడంతో వానలు పడి ఎక్కడ తడిసిపోతాయోనని రైతులు భయపడుతున్నారు. 

బ్యాంకుల్లో లిమిటెడ్ క్యాష్ 

వడ్లు అమ్ముకున్న రైతుల ఖాతాల్లో చాలా లేట్​గా డబ్బులు పడుతున్నాయి. ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కమర్షియల్​ బ్యాంకుల్లో మొత్తం ఒకేసారి డ్రా చేసుకునే చాన్సు ఉన్నా.. రోజుకు కొంత మందికే పేమెంట్​ చేస్తున్నారు. దీంతో చాలామంది గంటల తరబడి వెయిట్​ చేసినా.. అవకాశం రాక తిరిగివెళ్తున్నారు. ఇలా రెండు మూడు రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.  సహకార,  గ్రామీణ బ్యాంకుల్లో మాత్రం క్యాష్​ లిమిటెడ్​గా ఇస్తున్నారు. ఒక్కో రైతుకు ఇంతకుముందు  రూ. 40 వేల వరకు ఇవ్వగా ఇప్పుడు రూ. 20 వేలకు తగ్గించారు. కొన్నిచోట్ల వారానికి  రూ. 20 వేలకు మించి ఇవ్వడం లేదు. రూ. లక్ష తీసుకోవాలంటే ఐదుసార్లు బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. బ్యాంకుల్లో క్యాష్​షార్టేజీ వల్ల తాము చక్కర్లు కొడుతున్నామని వాపోతున్నారు. 

విత్తనాల కోసం క్యూలు   

వానలు షురూ కావడంతో విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. ఉమ్మడి ఖమ్మంలో మిరప, కరీంనగర్, వరంగల్​ తదితర జిల్లాల్లో వరి సీడ్ కోసం షాపుల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల  జీవ ఎరువులుగా వినియోగించే  జీలుగ, జనుము విత్తనాల కోసం కూడా బారులు తీరాల్సి వస్తోంది. మండలాల్లోనే అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచితే ఈ తిప్పలు తప్పేవంటున్నారు.

కరోనా టైంలో కష్టాలేందీ?  

వడ్ల పైసల కోసం ఇప్పటికి మూడుసార్లు బ్యాంకుకి పోయిన.  రూ. 90 వేల కోసం సుల్తానాబాద్ బ్యాంకు చుట్టూ నెల రోజులు తిరిగిన. వడ్లు అమ్మడం ఒక ఎత్తయితే పైసలు తీసుకోవడం మరో ఎత్తయితుంది. కరోనా టైంలో తిరగాల్నంటె భయమయితోంది. వారానికి రూ.20 వేలే ఇస్తున్నరు. పొద్దంతా బ్యాంకు ముందు నిల్చుంటే కాళ్లు నొప్పులు పెట్టాయి. ఇంకా బ్యాంకుల చుట్టే తిరిగితే పొలం పనులు ఎప్పుడు మొదలు పెట్టాలె. 
– తొర్రికొండ లచ్చయ్య, రైతు, సుల్తానాబాద్, పెద్దపల్లి 

సీడ్​ దొరుకుతలేవు 

నేను మిర్చి విత్తనాలు కొనేందుకు మహ బూబాబాద్​ జిల్లాలోని గార్ల నుంచి ఖమ్మం వచ్చిన. ఇక్కడ కూడా  బ్రాండెడ్​కంపెనీ సీడ్​ దొరుకుతలేవు. ఒక్కొక్కరికి 5, 10 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్న రు. వాటికి కూడా ఎక్కువ రేట్లు చెబుతున్నరు. రైతులకు ఉన్న ఊళ్లోనే విత్తనాలు దొరికేలా సర్కారు చర్యలు తీసుకోవాలె.  - పంత్, రైతు, 
గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా