
హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తామని రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడానికి నిరసనగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న తలపెట్టిన తెలంగాణ బంద్ కేవలం ఒకరికి మాత్రమే కాదని.. బీసీలందరి కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోన్న రెడ్డి జాగృతి పోరాటం చేయాలి కానీ అది న్యాయంగా ఉండాలని సూచించారు.
ఏ పార్టీతో మాకు సంబంధం లేదని.. బీసీల మంచి కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్, విజయభాస్కర్ రెడ్డితో బీసీల కోసం పోరాడితే కొంత న్యాయం జరిగిందని.. ఆ స్ఫూర్తి పోరాటం ఇప్పటికి కొనసాగుతుందన్నారు. ఎక్కువమంది పేదవాళ్లు బీసీల్లోనే ఉన్నారని.. బీసీలంటే అందరికీ చిన్న చూపేనని అన్నారు.
బీసీలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతుంది.. ఇప్పుడు కూడా అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 18న బీసీ బంద్కు అందరూ మద్దతు ఇస్తున్నారని.. ఒక్క ఎమర్జెన్సీ సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగానే బంద్ నిర్వహిస్తామని.. రాజ్యాధికారం వచ్చేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.