న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని.. ఈ మేరకు ప్రధాని మోడీ నాకు మాటిచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పందించారు. భారత్-రష్యా మధ్య ఇంధన సంబంధాలు సమకాలీనంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
రష్యాతో భారత్ ఇంధన సహకారం దాని జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని చెప్పారు. దేశ ప్రజల ప్రయోజనాలకే ఇండియా తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. డెనిస్ అలిపోవ్ వ్యాఖ్యలతో.. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు బంద్ పెడుతుందని ట్రంప్ చెప్పిన దాంట్లో నిజం లేదని తేలిపోయింది. ఇంధన రంగంలో భారత్-రష్యా మధ్య సహకారం చాలా అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమైంది.
►ALSO READ | అమెరికాలోని 4 ఎయిర్ పోర్టు కంప్యూటర్లు హ్యాక్
మూడేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యాతో వాణిజ్యం చేయొద్దని ప్రపంచదేశాలను ట్రంప్ హెచ్చరిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ మాత్రం దేశ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. తన మాట ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో ఇండియా ఎగుమతులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఇండియా.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది.
ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తుందని ట్రంప్ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ రియాక్ట్ అయ్యింది. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. తద్వారా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేది లేదని పరోక్షంగా ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చింది ఇండియా.
