కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర

కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర

అడ్డాకుల, నారాయణపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. సోమవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లను ముట్టడించారు. నారాయణపేట జిల్లా విద్యుత్‌‌‌‌‌‌‌‌ కార్యాలయం ముందు డీసీసీ ప్రెసిడెంట్ వాకిటి శ్రీహరి, సీనియర్​ నేత శివకుమార్​రెడ్డి ఆధ్వర్యంలో, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ కిసాన్‌‌‌‌‌‌‌‌ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి,  డీసీసీ ప్రెసిడెంట్ జి. మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న ఆయన ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంట్ కోతల కారణంగా తడిసిన పంటలే మళ్లీ తడుస్తున్నాయి తప్ప.. పూర్థిస్థాయిలో నీళ్లందడం లేదని వాపోయారు. యాసంగి పంటలకు విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాపై  ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు.  కరెంట్ ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుందో..?  తెలియని పరిస్థితి ఉండడంతో రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్దే కాపలా కాయాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం అప్రకటిక కరెంట్ కోతలు ఆపి, నిరంతరం సరఫరా చేయాలని విద్యుత్‌‌‌‌‌‌‌‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు వార్ల విజయ్ కుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి,  కార్యదర్శి విజయ మోహన్ రెడ్డి, నేతలు నర్సింహులు ముదిరాజ్, నాగిరెడ్డి శ్రీహరి, మద్దూర్ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో సర్కారు దిష్టిబొమ్మ దహనం

పెద్దకొత్తపల్లి(నాగర్​ కర్నూల్)వెలుగు:  కరెంట్ కోతలను నిరసిస్తూ  బీజేపీ నేతలు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం ప్రభుత్వ  దిష్టిబొమ్మను దహనం చేశారు.  వారు మాట్లాడుతూ విద్యుత్​ సరఫరాలో తెలంగాణ దేశానికే రోల్​మోడల్​ అని డబ్బాలు కొట్టుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు, మంత్రులు పంటలు ఎండిపోతుంటే ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు.  రాస్తారోకో చేస్తున్న నేతలను  పోలీసులు స్టేషన్​కు తరలించారు.  రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జలాల్ శివుడు, నేతలు శరత్ రెడ్డి,  భీమేశ్వర్​ రెడ్డి,  కడ్తాల కృష్ణయ్య,  తిరుమల్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఏఐసీకేఎస్‌‌‌‌‌‌‌‌, పీవైఎల్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ధర్నా..

ఊట్కూర్, వెలుగు:  24 గంటలు విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరా విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఏఐసీకేఎస్‌‌‌‌‌‌‌‌ జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్ రెడ్డి, పాతపల్లి సర్పంచ్ కృష్ణయ్య, పీవైఎల్‌‌‌‌‌‌‌‌ నేత సిద్దులు ఆరోపించారు. సోమవారం ఊట్కూర్ మండలం బిజ్వార్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ  సర్కారు చెప్పినట్లు వరిని తగ్గించి వేరుశనగ, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసినా.. కరెంట్‌‌‌‌‌‌‌‌ కోతలతో నీళ్లు సరిపోవడం లేదన్నారు . తరచూ మోటార్లు కాలిపోతుండడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి సలీమ్ , నరసింహ,  ఉపసర్పంచ్  నరసింహులు, రైతులు హనుమన్న,ఆషప్ప, భాస్కర్,  నరసింహులు పాల్గొన్నారు.