చెరుకు సంఘం నేతల అరెస్టుపై రైతుల ఆగ్రహం

చెరుకు సంఘం నేతల అరెస్టుపై రైతుల ఆగ్రహం
  • మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మల దహనం
  • రైతుల ఆందోళనలకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో మరోసారి చెరుకు రైతులు భగ్గుమన్నారు. ఈ నెల 10న మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చెప్పులు విసిరిన ఘటనలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, వెంపేట ఉప సర్పంచ్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని హైవేపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుల దిష్టి బొమ్మలను దహనం చేసి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవకుంటే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇప్పుడు ఫ్యాక్టరీ రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కనీసం మాట కూడా ఎత్తడం లేదని రైతులు విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తున్న రైతులను జైల్లో పెట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామన్నారు. టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొత్తులుగా కాకుండా చట్ట ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని కోరారు. ఎమ్మెల్యే మాటలు విని రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలన్నారు. అంతకు ముందు మామిడి నారాయణ రెడ్డి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని జైలుకు తరలిస్తుండగా, కోర్టు బయట రైతులు, కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెంకట్, కాంగ్రెస్, బీజేపీ నేతలు, రైతు ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించిన రైతులకు సంకెళ్లా? 
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరిన రైతులకు సంకెళ్లు వేస్తారా..? రైతులపై సర్కార్​ పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నది. మామిడి నారాయణరెడ్డిపై కేసులు పెట్టి, జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కేసీఆర్ అధికారంలోకి రాగానే మూసివేయించి, ఆ తర్వాత చెరుకు సాగు లేకుండా చేశారు. నారాయణరెడ్డిపై గతంలోనూ పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి క్షమాపణ చెప్పాలి. రైతుల మందుస్తు అరెస్టులను మానుకోవాలి. - ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించిన పోలీసులు
7 ఏళ్ల శిక్ష ఉన్న అన్ని కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా... మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చెప్పు విసిరిన కేసులో రైతు నేతలకు బెయిల్ ఇవ్వకుండా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. టీఆర్ఎస్ వాళ్లకో రూల్.. రైతులకు ఇంకో రూల్ ఉంటదా? రైతు నాయకులు చేసిన తప్పేంటి. మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని అడగడం తప్పా..? రైతులు చేస్తున్న ఉద్యమాలను సర్కారు అణగదొక్కాలని చూస్తోంది. నాయకుల అరెస్టును ఖండిస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించమంటే జైల్లో పెడతారా?
రైతులను రాజు చేయడమే లక్ష్యమంటున్న టీఆర్ఎస్ సర్కారు.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి రైతులను జైల్లో పెడుతున్నది. ఇదేనా రైతు ప్రభుత్వం అంటే?నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విన్నవిస్తామని చెప్తే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. అందుకే కడుపు మండి మంత్రి కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చెప్పు విసిరితే ఇన్ని సెక్షన్లలతో కేసు పెడతారా.. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా జైలుకు పంపుతారా..? నారాయణరెడ్డి, ప్రవీణ్ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. - పన్నాలా తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.