రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటున్నం : డీఎస్ చౌహాన్

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటున్నం :  డీఎస్ చౌహాన్
  • రాష్ట్రవ్యాప్తంగా 7,149 సెంటర్లలో కొనుగోళ్లకు ఏర్పాట్లు
  • ఇప్పటికే 6,919 సెంటర్లు ఓపెన్ చేసి 1.87 లక్షల టన్నుల వడ్లు కొన్నం
  • ఎంఎస్పీ కన్నా తక్కువకు  కొంటే కఠిన చర్యలు 
  • అక్రమాలకు పాల్పడిన  మిల్లర్లను వదలబోమని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది  లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో సెంటర్లను పెట్టడంతో పాటు వడ్ల సేకరణకు కావాల్సిన అన్ని ఏరాట్లు చేశామని  సివిల్స్ సప్లయ్స్  కమిషనర్  డీఎస్  చౌహాన్  తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తాలు పేరుతో తూకంలో ఇష్టంవచ్చినట్లు కట్  చేస్తే సహించేది లేదన్నారు. శనివారం సివిల్ సప్లయ్స్  భవన్ లో మీడియా సమావేశంలో కమిషనర్  మాట్లాడారు. నిరుటి కన్నా ఇరవై రోజుల ముందే సెంటర్లు ఓపెన్  చేసి వడ్లు కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పారు. ధాన్యం సేకరణకు కావాల్సిన గన్నీ  బ్యాగులు, టార్పాలిన్లు, రవాణా, మంచి నీటి వసతులు వంటివి కల్పించామని తెలిపారు. వరిసాగు  చేసే నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, జగిత్యాల, జనగాం, నిర్మల్  తదితర జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఆలస్యంగా నాట్లేసిన జిల్లాల్లో ఇప్పుడిప్పుడే కోతలు షురూ అయ్యాయని వెల్లడించారు. 

ఈయేడు యాసంగిలో 75.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు టార్గెట్  పెట్టుకున్నామని తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 7,149 సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 6,919 కేంద్రాలను ఓపెన్  చేశామని, ఇప్పటికే1.87 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ లోనే అత్యధికంగా లక్ష టన్నులు సేకరించామని చెప్పారు. కాంటా అయిన 48 గంటల్లో నిధులు రైతుల ఖాతాలో జమచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం సేకరణకు 18.85 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేయగా , 10.38 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని వెల్లడించారు. మిగతా వాటిని తొందరగా అందుబాటులోకి  తెస్తామని చెప్పారు. 

కొర్రీలు క్లియర్ చేయడంతో పెండింగ్ నిధులు వచ్చాయి

గతంలో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ పెట్టిన  కొర్రీలన్నీ వెంట వెంటనే  క్లియర్  చేశామని కమిషనర్  చౌహాన్  తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టే నాటికి 3 శాతం క్లియర్  కాగా నెల రోజుల్లో  98 శాతం క్లియర్ చేయడంతో పెండింగ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1200 కోట్లు వచ్చాయని వెల్లడించారు. సెంటర్ల నిర్వహణకు సంబంధించి రూ.393 కోట్లు ఇచ్చామని చెప్పారు.

ఎంఎస్పీ కన్నా తక్కువకు కొనొద్దు

మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్  చౌహాన్  హెచ్చరించారు. మద్దతు ధర కన్నా ఎక్కువ ధర పెడితే అభ్యంతరం లేదన్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కొరడా ఝళిపిస్తామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్  ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. మన రైతులను మోసం చేసి తక్కువకు కొనుగోలు చేయకుండా, ఇతర రాష్ట్రాల  రైతులు మన దగ్గర  అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా 54 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్  కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందివ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

ధాన్యం కొనుగోళ్లు టార్గెట్ 75.40లక్షల టన్నులు

రాష్ట్రంలో యాసంగిలో సాగైన వరిలో కోటి 20 లక్షల టన్నుల వరకు ధాన్యం ఉత్పత్తి వస్తుందని  అంచనా వేశామని డీఎస్  చౌహాన్  చెప్పారు. అందులో ప్రజల అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయాలు పోను 75.40 లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఐకేపీ సెంటర్లు,  సహకార సంఘాల ద్వారా నిర్వహించే ప్యాక్స్  సెంటర్లు వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం వస్తుందని అంచనా వేశామని తెలిపారు. నిరుటి కన్నా 5 లక్షల ఎకరాలు సాగు తగ్గిందని, 60 లక్షల టన్నుల వరకే మార్కెట్ కు వస్తుందని  అంచనా  వేశామని తెలిపారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఐరిస్  విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.