ఏసీబీ ఉచ్చులో మరో ప్రభుత్వ ఉద్యోగి పడ్డాడు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. గౌరవ ప్రదమైన జీతం తీసుకుంటూ.. లంచానికి మరిగిన అవినీతి తిమింగళాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు. గురువారం (అక్టోబర్ 30) మెదక్ జిల్లా ట్రాన్స్ కో డీఈ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం సీతానగర్ తండాకు చెందిన పాపగారి భాస్కర్.. ఆయన తల్లి పేరిట ఉన్న పౌల్ట్రీ ఫాం కోసం 25 కేవీఏ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ సాంక్షన్ కు డివిజనల్ ఇంజినీర్ (డీఈ) షేక్ షరీఫ్ చాంద్ భాషా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వకపోతే పని అయ్యేలా లేదని కొద్ది రోజుల ముందు రూ.9 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మిగతా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు పాపగారి భాస్కర్. తాము చెప్పినట్లుగా క్యాష్ ను డీఈకి ఇవ్వాల్సిందిగా చెప్పిన అధికారులు.. సరిగ్గా గురువారం(అక్టోబర్ 30) రూ.21 వేలు తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్ లో అధికారులు 21 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని బాధితునికి తిరిగి ఇచ్చేశారు. డీఈ చాంద్ భాషా పైన కేసు నమోదు చేశారు.
