వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటన్రు

వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటన్రు
  • ధాన్యం కొనుగోళ్లు స్పీడ్​ చేయని సర్కారు   
  • ఇప్పటికీ పావు వంతూ కొనలే 
  • తేమ పేరుతో రిజెక్ట్​చేస్తున్న మిల్లర్లు
  • కాంటాలు బంద్​పెడుతున్న ఆఫీసర్లు
  • దళారులకు అమ్మి మునుగుతున్న రైతులు

నెట్​వర్క్​, వెలుగు: సెంటర్లకు వడ్లు తెచ్చి నెల దాటిపోతున్నా రాష్ట్ర సర్కారు కొనుగోళ్లు స్పీడప్​ చేయకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేట్​వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నరు. ఓవైపు గడిచిన వారం, పదిరోజులుగా తేమ సాకుతో వడ్ల లోడ్​లను  మిల్లర్లు దింపుకుంటలేరు. మిల్లర్లు కొంటలేరని మెజారిటీ సెంటర్లలో కాంటాలు బంద్​పెట్టిన్రు. వారం, పదిరోజులుగా రోజుకు కనీసం లక్ష టన్నులు కూడా కొంటలేరు. ఇప్పటికీ టార్గెట్​లో పావు వంతు కూడా వడ్లు కొనలేదు. మరోవైపు వరుస తుఫాన్లతో ఎప్పుడు వాన పడి, ఉన్న వడ్లు కొట్టుకపోతయో తెలుస్తలేదు. 

ఇప్పటికే వందలాది సెంటర్లలో వడ్లు తడిసి మొలకలువచ్చినయి. కొన్నిచోట్ల రంగుమారినయ్​. వీటిని కొనే విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రోజుల తరబడి కుప్పల వద్ద పడిగాపులు కాయడం వృథా అని భావిస్తున్న రైతులు.. చివరికి దళారులను ఆశ్రయిస్తున్నరు. ఇదే అదనుగా వ్యాపారులు అడ్డికి పావుశేరు అడుగుతున్నరు. మద్దతు ధర కంటే  200,300 తక్కువ ఇవ్వడమేగాక తప్ప, తాలు పేరుతో క్వింటాల్​కు 3 కిలోల చొప్పున కట్​​చేసి దోచుకుంటున్నారు. 

ఇంకా పావు వంతు కూడా కొనలే.. 

రాష్ట్రంలో 6,876 సెంటర్ల ద్వారా కోటీ 3లక్షల 95వేల284 మెట్రిక్​టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన సర్కారు.. ఇప్పటివరకు 6,051 సెంటర్లను ఓపెన్​ చేసి 22.08 లక్షల మెట్రిక్​టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసింది. అంటే గడిచిన నెలన్నర రోజుల్లో కేవలం16శాతం కొనుగోళ్లకే సర్కారు పరిమితమైంది. 825 సెంటర్లను ఇంకా ఓపెన్​చేయనేలేదు. ఓపెన్​ చేసిన సగం సెంటర్లలో కాంటాలు పెట్టట్లేదు. మబ్బులు, వర్షాల కారణంగా వడ్లలో తేమశాతం ఎక్కువగా ఉంటోందని సెంటర్ల నుంచి వస్తున్న వడ్ల లోడ్​లను  మిల్లర్లు దింపుకోవట్లేదు. 

మిల్లర్ల ఆదేశాలతో వందలాది సెంటర్లలో కాంటాలు బంద్​పెట్టారు. దీంతో గడిచిన వారం, పది రోజులుగా రోజులో కనీసం లక్ష టన్నులు కూడా కొనడం లేదు. ఆదివారం రాష్ట్రమంతా కలిపి కేవలం 78వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొనుగోళ్లు ఇలాగే జరిగితే మొత్తం వడ్లు కొనేందుకు మరో మూడు నెలలు పట్టే అవకాశముంది. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు తడిసి మొలకలువస్తున్నాయి. తాజాగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్​తో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి మబ్బులు కమ్ముకోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 

అగ్గువకు అమ్ముకుంటన్రు..

నెలరోజులుగా సర్కారు తీరుతో విసిగిపోయిన రైతులు చివరికి దళారులకు అమ్ముకుంటున్నారు. రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్​ వ్యాపారులు అడ్డికి పావుశేరు అడుగుతున్నారు. క్వింటాల్​కు రూ.1960 మద్దతు ధర ఉండగా, రూ.1750 నుంచి రూ.1800 వరకు చెల్లిస్తున్నారు. అంటే క్వింటాల్​పై రూ.160 నుంచి రూ.210 వరకు దోచుకుంటున్నారు. అంతేకాకుండా తప్ప, తాలు కింద ప్రతి క్వింటాల్​కు 3 కిలోల పైసలు కట్​చేస్తున్నారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్తున్న వ్యాపారులు నెట్​ కావాలంటే రూపాయికి 2పైసల చొప్పున వడ్డీ కట్​ చేసుకొని ఇస్తున్నారు. 

కాగా, మిల్లర్లు దళారులు ఒక్కటేనని, ప్రైవేటుగా కొన్న వడ్లను తిరిగి రైస్​మిల్లులకే తరలించి రైతులను ముంచుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాము నిండా మునుగుతున్నామని తెలిసినప్పటికీ తమకు వేరే దారిలేదని రైతులు అంటున్నారు. మిల్లర్ల చేతిలో సర్కారు  కీలుబొమ్మగా మారిందని, నిర్వాహకులు, మిల్లర్లు కలిసి తేమ పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పట్లో సర్కారు తమ వడ్లను కొంటుందనే నమ్మకం లేకే బయట అమ్ముకుంటున్నామని చెబుతున్నారు.

క్వింటాల్​కు రూ.150  లాస్

నాకు మూడు ఎకరాల్లో 75 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వచ్చింది.సెంటర్​ల పోసి నెలైనా కొంటలేరు. సర్కారు కొంటే క్వింటాల్​కు1960 రూపాయలు వచ్చేటివి. కానీ బయట దళారికి రూ.1750కి క్వింటాల్​ చొప్పున అమ్మిన. క్వింటాల్​కు 3 కిలోల లెక్క కడ్త తీసిన్రు. పైసలు అదే రోజు కావాలంటే వెయ్యికి రూ.20 చొప్పున ముందే కట్​చేసుకొని ఇచ్చిన్రు. మస్తు లాసైన. కానీ తప్పలే.

కుంట శ్రీనివాస్, రైతు, పాలెం, నిజామాబాద్ జిల్లా

మా ఊళ్లె1430 చొప్పున 20 లారీలు అమ్మినం

వరి కోతలై దగ్గర దగ్గర నెల అయితున్నా సర్కారు వడ్లు కొంటలేదు. తుఫాన్ల వల్ల ఎప్పుడు వాన పడ్తదో తెలుస్తలేదు. మొన్నటి వానలకు చాలా మంది వడ్లు తడిసినయ్. నా వడ్లు కూడా మొలకస్తయని భయమై ప్రైవేట్ వ్యాపారికి అమ్మిన. సెంటర్ల రూ.1960 నడిస్తే వ్యాపారి మాత్రం రూ.1430 చొప్పున ఇచ్చిండు. మా ఊళ్లె రూ.1430 చొప్పున 20 లారీలు, రూ.1750ల ప్రకారం 15 లారీల వడ్లు అమ్మిన్రు.  

మ్యాకల మాధవ రెడ్డి,  మహదేవన్ పేట, బిజినేపల్లి మండలం, నాగర్​కర్నూల్​ జిల్లా

తక్కువ రేటుకే అమ్ముకున్న

వడ్లు తెచ్చిపోసి నెల గడుస్తున్నా సర్కారు కొనుగోలు కేంద్రాల్లో  కొంటలేరు. తుఫాన్లతో  మాటిమాటికి ముసురు పట్టి భయమేస్తోంది. ఇట్ల చూసుకుంటూ పోతే మరో నెల గడిచినా కొంటరనే గ్యారెంటీ లేదు. అందుకే  ప్రైవేట్ వ్యాపారికి తక్కువ ధరకు అమ్ముకున్న. 77 కిలోల బస్తా ఒక్కోదానిని రూ.వెయ్యి చొప్పున కొన్నారు. అగ్గువకే అని తెలిసినా, తప్పలేదు. 

పెనుగొండ వీరేశ్​, రైతు, చెన్నూరు, ఖమ్మం జిల్లా